కుక్కను కొట్టి చంపిన గ్రామస్తులు
ఖానాపురం వరంగల్ : పిచ్చికుక్క దాడిలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిచ్చికుక్క గ్రామంలో స్వైర విహారం చేస్తూ ప్రజలను కరిచింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు, యువకులు కుక్కను వెంబడించి మట్టుబెట్టారు. పిచ్చికుక్క ప్రజలందరి ఎడమ కాలినే కరవడం గమనార్హం. ఈ ఘటన ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఒకే పిచ్చికుక్క ఏకంగా 30 మందిని గాయపర్చడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో ప్రజలు ఏమీ చేయాలో అర్థం కాక పోలీసులకు 100కు డయల్ చేసినా పోలీసులు స్పందించలేదు.
బాధితులు వీరే..
గ్రామానికి చెందిన సేరు ఓంప్రియ, కోడి హైమ, గారె కొంరమ్మ, ఐతె సాయమ్మ, కేశపాక వరలక్ష్మి, నల్లతీగల నీలమ్మ, పైండ్ల ప్రశాంత్, షేక్ గులాంరసూల్, నందగిరి లలిత, జెల్ల వెంకన్న, సింగు వెంకటయ్య, షేక్ లాక్య, ఉప్పలమ్మ, సోమగాని అరుణ, వేల్పుల రాణి, సింగు శాంతమ్మ, బత్తుల గోపమ్మ, గణపురం కోమలత, బోనగిరి శ్రీను, యాపచెట్టు రజిత, ధర్నోజు ఉప్పలయ్య, చాట్ల నర్సయ్య, పులిగిల్ల స్వరూప, పావనీతో పాటు మరికొంత మందిని తీవ్రంగా గాయపరిచింది.
కుక్కను చంపిన గ్రామస్తులు..
గ్రామ యువకులు కుక్కను వెంబడించి చంపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన బాధితులను అంబులెన్స్, ప్రైవేట్ వాహనాల ద్వా రా నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రాధమిక వైద్య చికిత్సలు అందించిన తర్వా త పలువురిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు.
కొంపెల్లిలో..
భూపాలపల్లి రూరల్ : మండల పరిధిలోని కొంపెల్లి గ్రామంలో కుక్కల స్వైర విహారంతో పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం పాలేరుగా సాదా యాదగిరి పనుల నిమిత్తం వెళ్తుండగా గ్రామంలో పిచ్చికుక్కలు దాడి చేశాయి. దీంతో యాదగిరి కాలుకు గాయమైంది. కుటుంబసభ్యులు చికిత్స కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత వారం రోజులుగా కుక్కలు గ్రామంలో గుంపులు, గుంపులుగా తిరుగుతూ కరుస్తున్నాయని, వారంలో కుక్కలకాటుకు పిట్టల కొమురక్క, కాసగాని సదయ్య, దన్నాడ నారాయణరెడ్డితో పాటు సుమారు 20 మందికి గాయాలై చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు గ్రామంలో పర్యటించి కుక్కల బాధనుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment