మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్
అశ్వారావుపేట: మతమార్పిడి, లైంగిక దాడులకు పాల్పడుతున్న ముగ్గరు వ్యక్తులను పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు బుధవారం అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టుకు రిమాండ్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే వలీఅహ్మద్ అశ్వారావుపేటలోని ఏఎస్‌ఆర్‌నగర్‌లో మదర్సా నిర్వహిస్తున్నాడు. దీనిని ‘ద రియల్ మెస్సేజ్ సెంటర్ మదర్సా ఈ దావత్ హక్’ పేరుతో 2010లో మేడిపల్లిలో ప్రారంభించారు. ఆ తర్వాత 2011లో అశ్వారావుపేటకు మార్చారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపి 2018లో ఖమ్మంలోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి 116 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారు. నిరుపేద దూదేకుల కులానికి చెందిన పిల్లలకు ఉర్దూ, అరబిక్ నేర్పడం, చెడు అలవాట్లకు బానిసలైన వారిని మార్చడం, అన్ని మతాలసారం ఒక్కటేనని చెప్పి దేశ సమైక్యతను పెంపొందించడం ఈ మదర్సా స్థాపన లక్ష్యమని రిజిస్ట్రేషన్ కోసం పొందు పర్చిన పత్రాల్లో పేర్కొన్నారు.
కానీ, ఈ మదర్సా నిర్వాహకుడు ఎస్కే వలీ.. తన పెద్దకొడుకు ఎస్కే అబ్దుల్ రజాక్, తన బావమరిది ఎస్కే జానీతో కలిసి సాయం కోసం వచ్చే గిరిజన మహిళలతో మతమార్పిడి చేయించడం, వారిపై లైంగికదాడి చేయడం, మదర్సాలో చదివే పిల్లలకు బాల్య వివాహాలు చేయడం, మతమార్పిడి చేసిన వారి ఫొటోలను ఉపయోగించి ఇతర గ్రామాల్లోని మసీదుల వద్ద పెద్దమొత్తంలో చందాలు వసూలు చేయడం లాంటి పనులు చేశారు. ఈ చందాలతో ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 మంది హిందువులను ముస్లింలుగా మార్చాడు. వారిలో 8 మంది గిరిజనులు. గోదావరిఖని గ్రామానికి చెందిన ఎండీ మున్నా కుమార్తె (మైనర్)కు ఎస్కే వలీ బలవంతంగా వివాహం చేశాడని, అతడి కొడుకు అబ్దుల్ రజాక్ లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఎం.అబ్బయ్య, ఎస్ఐలు వేల్పల వెంకటేశ్వరావు, మధుప్రసాద్ ఉన్నారు.