'కేసీఆర్ ఒప్పుకుంటే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒప్పుకుంటే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం 'సాక్షి'తో మాట్లాడుతూ 26 కులాలను బీసీల నుంచి తొలగించడంతో తన నియోజకవర్గంలో వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వాళ్లని బీసీ జాబితాలో చేర్చాలన్నదే తన కోరిక అని మాధవరం తెలిపారు.
సమస్యను అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు సొంత పార్టీ తనకు అండగా నిలవకపోవడం అసంతృప్తి కలిగించిందని మాధవరం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ బలంగా ఉంటే కంటోన్మెంట్లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయామని ఆయన ప్రశ్నించారు. తానొక్కడినే కాదని, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలంతా అధికార పార్టీతో టచ్లో ఉన్నారని మాధవరం పేర్కొన్నారు. కాగా ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మాధవరం కలవనున్నారు.