'ఆజాద్ హింద్ ఫౌజ్' జవాన్ ఇకలేరు!
కోటవురట్ల (విశాఖపట్టణం): దేశమాత దాస్య శృంఖాలు తెంపేందుకు అలుపు ఎరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు మద్దిల గంగాధరరావు ఇక లేరు. నిండు నూరేళ్ల జీవితాన్ని జీవించిన ఆయన (101) మంగళవారం కన్నుమూశారు. విశాఖ జిల్లా కోటవురట్ల శివారు రాట్నాలపాలెంలో 1915లో జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. 1937లో కటక్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్‌ఫౌజ్'లో సైనికుడిగా పనిచేశారు.
అనంతరం అహ్మదాబాద్‌లో మిలటరీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన యుద్ధాల్లోనూ తన సేవలందించారు. 1967, 1971లలో రాష్ట్రపతి అవార్డులతో సహా మొత్తం 11 పురస్కారాలు అందుకున్నారు. 1974లో ఉద్యోగ విరమణ చేశారు. అల్లూరి సీతారామరాజుతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.