maddilapalem
-
వైరల్‌గా మారిన క్రాంతిదాస్ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు!
‘కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నట్లు ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలా మంది మహిళలు. తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే శిరోజాలను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఉరుకు పరుగుల నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యంతో కురులు ఊడిపోతున్నాయి. వాలుజడ అన్నమాట బాపు సినిమాల్లోని హీరోయిన్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఊడిపోతున్న జుట్టు.. కోల్పోతున్న అందం.. మహిళల ధైర్యాన్ని.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో వారు ఆత్మనూన్యతా భావానికి గురవుతున్నారు. బయట ప్రపంచానికి ముఖం చాటేస్తున్నారు. అలాంటి మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు ఓ మగువ పెద్ద సాహసమే చేసింది. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ క్యాంపెయిన్‌లో భాగస్వామిగా మారింది. తన ఒత్తైన.. నిగనిగలాడే శిరోజాలను తొలగించుకుంది. సోషల్ మీడియాలో గుండుతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి.. మహిళల్లో మనోస్థైర్యం నింపేందుకు ముందుడుగు వేసింది. ఆమే క్రాంతిదాస్. ఈ ఆలోచనల వెనుక కారణాలు ఆమె మాటల్లోనే విందాం.. మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అమ్మకు తల వెంట్రుకలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని గుర్తించాం. దీంతో ఆమె బయటకు రావడానికి ఇబ్బందులు పడేది. ఎక్కడికైనా వెళ్లాలంటే స్కార్ఫ్ వేసుకుని వెళ్లేది. దీన్ని చూసి నేను ఆలోచనలో పడ్డాను. అదే సమయంలో క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. మహిళలకు జుట్టే అందం. క్యాన్సర్, పోషకాహార లోపం, కాలుష్యం, తదితర కారణాలతో చాలా మంది జుట్టును కోల్పోతున్నారు. తక్కువ జుట్టు/గుండుతో బయట తిరగలేక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపాలనే దఢృమైన ఆలోచన నాలో మెదిలింది. నా జుట్టును తొలగించుకుని.. బాధిత మహిళలకు అండగా ఉండాలని భావించాను. కుటుంబ సభ్యులు, భర్త ఆమోదంతో నా కురులను షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా హెడ్ షేవ్.. ఇలాంటి వారిని చూసిన తర్వాత.. వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తలంపు వచ్చింది. బట్టతల ఉన్న వారు జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పూర్తిగా జట్టురాని వారు విగ్గులు పెట్టుకుని.. ఇబ్బందిగానే కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఎంత కాలం? మీలో మీకే మార్పు రావాలి. ముందుగా మిమ్మల్ని మీరే ఇష్టపడాలి. అప్పుడు అందం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అని బాధిత మహిళలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒత్తుగా ఉన్న నా జట్టును తొలగించుకున్నాను. క్లీన్ హెడ్ షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా పూర్తిగా గుండుతోనే ఉంటున్నా.. కొన్నాళ్ల పాటు ఇలానే ఉంటా. నా పరిధిలో సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో నేను గుండుతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తున్నాను. జట్టు రాలిపోయిన మహిళలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. గుండుతోనూ మహిళ అందంగా ఉంటుందనే భావన కలిగేందుకు ప్రయత్నం చేస్తున్నా.. నా గుండు ఫొటోలు చూసి కొందరైనా మనోస్థైర్యం పొందుతారని ఆకాంక్షిస్తున్నా.. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ జుట్టులేని వారు వారిలో అలాంటి లోపం ఉందనే భావనే కలగకూడదు. అలా ఉండడం నేటి రోజులు ఓ ట్రెండ్ అనే ఆలోచన రావాలి. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే అంశం ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్యాంపెయిన్ హాలీవుడ్లో జోరుగా సాగుతోంది. గతంలో హీరోయిన్ సోనాలి బింద్రే సైతం ఇలాంటి క్యాంపెయిన్ చేశారు. మనీషా కోయిరాల క్యాన్సర్‌ను జయించారు. అప్పటో వారు జట్టు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. సాటి మనిషిని ప్రేమించాలి మనిషిని మనిషిగా ప్రేమించడం.. వారిలో లోపాలను వెతుకుతూ.. ఆత్మనూన్యత భావాన్ని కలిగించడం భావ్యం కాదు. అలాంటి వారిని మనతో సమానంగా చూసుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినవారమవుతాం. అదే నా లక్ష్యం.. స్వతహాగా నేను జంతు ప్రేమికురాలిని. జంతువులకు ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఎంతో మదన పడుతుంటాను. గతంలో వైజాగ్ కేంద్రంగా రతన్ టాటా సంస్థతో కలిసి జంతువుల సంరక్షణపై పనిచేశాను. వీధుల్లో సంచరించే జంతువులకు రిఫ్లెక్టివ్ కాలర్లు పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను. ప్రస్తుతం విశాఖ, బెంగళూరులో జంతువుల సంరక్షణపై పనిచేస్తున్నాను. కుటుంబ నేపథ్యం.. నగరంలోని మురళీనగర్‌లో చేముడూరి క్రాంతిదాస్ నివాసం ఉంటున్నారు. ఆమె భర్త నాగతేజ చేముడూరి ఐటీ రిక్యూటర్. తండ్రి జగదీష్ నేవీలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. తల్లి శారదదాస్ గృహిణి. జుట్టు రాలిపోవడానికి బోలెడు కారణాలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయం కాదు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మోటిక్స్.. అన్నింటి ఫలితం జుట్టు రాలిపోతుంది. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి కారణాలతో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఒత్తుగా లేకపోకపోతే తోటి ఆడపిల్లలే ఎగతాళి చేసే పరిస్థితులు అక్కడ క్కడా వెలుగుచూస్తుంటాయి. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. జుట్టు లేనివారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ కారణంగా జట్టును పూర్తిగా తొలగిస్తారు. అలోపిషియా బారిన పడిన పడిన మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి వారు జట్టును పూర్తిగా కోల్పోతారు. పూర్తిగా రూపం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డిజార్డర్ బారిన పడిన మగువలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. -
చంద్రబాబు కొమ్ములు వంచుతాం
సాక్షి, మద్దిలపాలెం (విశాఖ తూర్పు) : వరాలు కురిపిస్తామని, బతుకులు బాగు చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు కొమ్ములు వంచేందుకు కార్మికులు కదనరంగలోకి దిగనున్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. జూలై 1వ తేదీన విశాఖనగరంలో నిర్వహించనున్న కార్మిక గర్జన సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయనతోపాటు నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు సోమవారం నగర పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 2014లో అధికారమే పరమావధిగా భావించిన చంద్రబాబు కార్మికులకు 49 హామీలను ఇచ్చారన్నారు. వాటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు చేయకుండా కార్మికులను దగా చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించారన్నారు. హక్కులను సైతం కాలరాస్తూ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. కార్మికులతో పెట్టుకుంటే టీడీపీ బంగాళఖాతంలో కలిసిపోవడం ఖాయమని రాబోయే ఎన్నికలలో రుజువు చేస్తారన్నారు. అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించిందన్నారు. కార్మికులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు కార్మికులు, నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారన్నారు. రాబోయే ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కల్యాణి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉషాకిరణ్, నగర ట్రేడ్ యూని యన్ అధ్యక్షుడు బద్రినాథ్, మాజీ కార్పొరేటర్లు నడింపల్లి కృష్ణంరాజు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు, ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, అధికార ప్రతినిధి మర్టూరి పరదేశి, వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీ నక్క వెంకటరమణ, మస్తానప్ప, సంపంగి ఈశ్వరరావు, పిట్టా రెడ్డి, జి.వి.శ్రీనివాస్, కె.సుధాకర్, కె.సత్యనారాయణ, కాళీదాసురెడ్డి పాల్గొన్నారు. -
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
విశాఖపట్నం: విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టర్ వీఎస్.కృష్ణా కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న ఆంధ్రాబ్యాంకు జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్ అనిల్ కుమార్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, 3.5 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు చోరీకి గురయ్యాయని తెలుసుకుని ఆయన ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ ఈ నెల 1న అనకాపల్లి వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడం... లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉండడాన్ని చూసి దోపిడీ జరిగినట్టు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.