కార్మిక గర్జన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌టీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి
సాక్షి, మద్దిలపాలెం (విశాఖ తూర్పు) : వరాలు కురిపిస్తామని, బతుకులు బాగు చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు కొమ్ములు వంచేందుకు కార్మికులు కదనరంగలోకి దిగనున్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. జూలై 1వ తేదీన విశాఖనగరంలో నిర్వహించనున్న కార్మిక గర్జన సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయనతోపాటు నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు సోమవారం నగర పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 2014లో అధికారమే పరమావధిగా భావించిన చంద్రబాబు కార్మికులకు 49 హామీలను ఇచ్చారన్నారు.
వాటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు చేయకుండా కార్మికులను దగా చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించారన్నారు. హక్కులను సైతం కాలరాస్తూ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. కార్మికులతో పెట్టుకుంటే టీడీపీ బంగాళఖాతంలో కలిసిపోవడం ఖాయమని రాబోయే ఎన్నికలలో రుజువు చేస్తారన్నారు. అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించిందన్నారు. కార్మికులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు కార్మికులు, నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారన్నారు.
రాబోయే ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కల్యాణి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉషాకిరణ్, నగర ట్రేడ్ యూని యన్ అధ్యక్షుడు బద్రినాథ్, మాజీ కార్పొరేటర్లు నడింపల్లి కృష్ణంరాజు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు, ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, అధికార ప్రతినిధి మర్టూరి పరదేశి, వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీ నక్క వెంకటరమణ, మస్తానప్ప, సంపంగి ఈశ్వరరావు, పిట్టా రెడ్డి, జి.వి.శ్రీనివాస్, కె.సుధాకర్, కె.సత్యనారాయణ, కాళీదాసురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment