వైరల్‌గా మారిన క్రాంతిదాస్‌ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు! | Bald is Beautiful Campaign: Visakhapatnam Woman Chemuduri Krantidas‌ Viral Photos | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన క్రాంతిదాస్‌ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు!

Published Fri, Apr 8 2022 1:42 PM | Last Updated on Fri, Apr 8 2022 1:59 PM

Bald is Beautiful Campaign: Visakhapatnam Woman Chemuduri Krantidas‌ Viral Photos - Sakshi

‘కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నట్లు ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలా మంది మహిళలు. తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే శిరోజాలను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఉరుకు పరుగుల నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యంతో కురులు ఊడిపోతున్నాయి. వాలుజడ అన్నమాట బాపు సినిమాల్లోని హీరోయిన్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఊడిపోతున్న జుట్టు.. కోల్పోతున్న అందం.. మహిళల ధైర్యాన్ని.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో వారు ఆత్మనూన్యతా భావానికి గురవుతున్నారు. బయట ప్రపంచానికి  ముఖం చాటేస్తున్నారు. అలాంటి మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు ఓ మగువ పెద్ద సాహసమే చేసింది. బాల్డ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ క్యాంపెయిన్‌లో భాగస్వామిగా మారింది. తన ఒత్తైన.. నిగనిగలాడే శిరోజాలను తొలగించుకుంది. సోషల్‌ మీడియాలో గుండుతో ఉన్న  ఫొటోలు పోస్ట్‌ చేసి.. మహిళల్లో మనోస్థైర్యం నింపేందుకు ముందుడుగు వేసింది. ఆమే క్రాంతిదాస్‌. ఈ ఆలోచనల వెనుక కారణాలు ఆమె మాటల్లోనే విందాం..                               

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అమ్మకు తల వెంట్రుకలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని గుర్తించాం. దీంతో ఆమె బయటకు రావడానికి ఇబ్బందులు పడేది. ఎక్కడికైనా వెళ్లాలంటే స్కార్ఫ్‌ వేసుకుని వెళ్లేది. దీన్ని చూసి నేను ఆలోచనలో పడ్డాను. అదే సమయంలో క్యాన్సర్‌ రోగులు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. మహిళలకు జుట్టే అందం. క్యాన్సర్, పోషకాహార లోపం, కాలుష్యం, తదితర కారణాలతో చాలా మంది జుట్టును కోల్పోతున్నారు. తక్కువ జుట్టు/గుండుతో బయట తిరగలేక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపాలనే దఢృమైన ఆలోచన నాలో మెదిలింది. నా జుట్టును తొలగించుకుని.. బాధిత మహిళలకు అండగా ఉండాలని భావించాను. కుటుంబ సభ్యులు, భర్త ఆమోదంతో నా కురులను షేవ్‌ చేసుకున్నాను. 

40 రోజులుగా హెడ్‌ షేవ్‌..  
ఇలాంటి వారిని చూసిన తర్వాత.. వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తలంపు వచ్చింది. బట్టతల ఉన్న వారు జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పూర్తిగా జట్టురాని వారు విగ్గులు పెట్టుకుని.. ఇబ్బందిగానే కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఎంత కాలం? మీలో మీకే మార్పు రావాలి. ముందుగా మిమ్మల్ని మీరే ఇష్టపడాలి. అప్పుడు అందం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అని బాధిత మహిళలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒత్తుగా ఉన్న నా జట్టును తొలగించుకున్నాను. క్లీన్‌ హెడ్‌ షేవ్‌ చేసుకున్నాను. 40 రోజులుగా పూర్తిగా గుండుతోనే ఉంటున్నా.. కొన్నాళ్ల పాటు ఇలానే ఉంటా. నా పరిధిలో సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లో నేను గుండుతో ఉన్న ఫొటోలు షేర్‌ చేస్తున్నాను. జట్టు రాలిపోయిన మహిళలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. గుండుతోనూ మహిళ అందంగా ఉంటుందనే భావన కలిగేందుకు ప్రయత్నం చేస్తున్నా.. నా గుండు ఫొటోలు చూసి కొందరైనా మనోస్థైర్యం పొందుతారని ఆకాంక్షిస్తున్నా.. 

బాల్డ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ 
జుట్టులేని వారు వారిలో అలాంటి లోపం ఉందనే భావనే కలగకూడదు. అలా ఉండడం నేటి రోజులు ఓ ట్రెండ్‌ అనే ఆలోచన రావాలి. బాల్డ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అనే అంశం ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్యాంపెయిన్‌ హాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. గతంలో హీరోయిన్‌ సోనాలి బింద్రే సైతం ఇలాంటి క్యాంపెయిన్‌ చేశారు. మనీషా కోయిరాల క్యాన్సర్‌ను జయించారు. అప్పటో వారు జట్టు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.  

సాటి మనిషిని ప్రేమించాలి 
మనిషిని మనిషిగా ప్రేమించడం.. వారిలో లోపాలను వెతుకుతూ.. ఆత్మనూన్యత భావాన్ని కలిగించడం భావ్యం కాదు. అలాంటి వారిని మనతో సమానంగా చూసుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినవారమవుతాం. అదే నా లక్ష్యం.. స్వతహాగా నేను జంతు ప్రేమికురాలిని. జంతువులకు ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఎంతో మదన పడుతుంటాను. గతంలో వైజాగ్‌ కేంద్రంగా రతన్‌ టాటా సంస్థతో కలిసి జంతువుల సంరక్షణపై పనిచేశాను. వీధుల్లో సంచరించే జంతువులకు రిఫ్లెక్టివ్‌ కాలర్లు పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను. ప్రస్తుతం విశాఖ, బెంగళూరులో జంతువుల సంరక్షణపై పనిచేస్తున్నాను.  

కుటుంబ నేపథ్యం.. 
నగరంలోని మురళీనగర్‌లో చేముడూరి క్రాంతిదాస్‌ నివాసం ఉంటున్నారు. ఆమె భర్త నాగతేజ చేముడూరి ఐటీ రిక్యూటర్‌. తండ్రి జగదీష్‌ నేవీలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. తల్లి శారదదాస్‌ గృహిణి.  

జుట్టు రాలిపోవడానికి బోలెడు కారణాలు 
వెంట్రుకలంటే ఆఫ్టరాల్‌ అని కొట్టిపారేసే విషయం కాదు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మోటిక్స్‌.. అన్నింటి ఫలితం జుట్టు రాలిపోతుంది. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి కారణాలతో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఒత్తుగా లేకపోకపోతే తోటి ఆడపిల్లలే ఎగతాళి చేసే పరిస్థితులు అక్కడ క్కడా వెలుగుచూస్తుంటాయి. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. జుట్టు లేనివారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు. క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపీ కారణంగా జట్టును పూర్తిగా తొలగిస్తారు. అలోపిషియా బారిన పడిన పడిన మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి వారు జట్టును పూర్తిగా కోల్పోతారు. పూర్తిగా రూపం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డిజార్డర్‌ బారిన పడిన మగువలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement