రూ. కోట్లు వసూలు చేసిన దొంగబాబా
ఆధ్యాత్మిక ముసుగులో రూ. కోట్లు వసూలు
బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు
హైదరాబాద్: ఆధ్యాత్మిక ముసుగులో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి బినామీ పేర్లతో ఆస్తులు కొంటున్న ఓ దొంగ బాబాను చైతన్యపురి పోలీసు లు అరెస్ట్ చేశారు. సీఐ నవీన్‌కుమార్ కథనం ప్రకారం...కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన మద్దూరు ఉమాశంకర్ (49) పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం 2004లో హైదరాబాద్ నగరానికి వచ్చిన అతను డబ్బు సంపాదన కోసం ఉమాశంకర్ స్వామి అవతారం ఎత్తాడు. జాతకాలు చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్కేపురంలో ఉంటూ తన స్నేహితులు దుర్గాప్రసాద్, సీఎంకే.రావు సహకారంతో ‘అవర్ ప్లేస్’ పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు.
దీనికితోడు రాజమండ్రి, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారులను, బడా వ్యక్తులను మోసం చేసి వచ్చిన డబ్బుతో శంషాబాద్‌లో బినామీ పేర్లతో 4.25 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని చేతిలో మోసపోయిన కొత్తపేట ఇన్‌కాంట్యాక్స్ కాలనీకి చెందిన వెంకటరమణారావు బుధవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 50 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం పోలీసులు ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇతను సుమారు రూ. 30-40 కోట్లు వసూలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.