జలదోపిడీ
► కర్ణాటక కుట్ర
► తమిళ ప్రజల ఇక్కట్లు
టీనగర్: మేట్టూర్ డ్యాం ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం కాలువ తవ్వి నీటి దోపిడీకి పాల్పడింది. ఇది రాష్ట ప్రజలను ఆందోళనకు గురిచేసింది. తమిళనాడు సరిహద్దు ఆనుకుని కర్ణాటకలో ప్రసిద్ధిచెందిన మాదేశ్వరన్ ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి వెళుతుంటారు. ఈ ఆలయం చుట్టూ గల కొలనులు, తీర్థాలు నీళ్లు లేకుండా ఎండిపోతున్నాయి. దీంతో మేట్టూర్ డ్యాం రిజర్వాయర్ ప్రాంతమైన దిగువ పాలారులో చెక్‌డ్యాం ఏర్పాటుచేసి 20 కిలోమీటర్ల దూరంలోగల అటవీ ప్రాంతానికి నీటిని తీసుకువెళుతున్నారు. అక్కడి నుంచి మాదేశ్వరన్ ఆలయంలో ఉన్న అతిపెద్ద ఓవర్‌హెడ్ ట్యాంకులో నిల్వ చేసి భక్తుల అవసరాలకు వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఎండిపోయిన నీటి కొలనులు, తీర్థాలను నింపుతున్నారు.
ప్రస్తుతం మేట్టూర్ డ్యాంకు నీటి రాక సెకనుకు 25 ఘనపుటడుగులుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రొక్లెయిన్ యంత్రం ద్వారా దిగువ పాలారు ప్రాంతంలో కాలువను తవ్వి హోగెనేకల్ నుంచి వచ్చే నీటిని మాదేశ్వరన్ కొండపైగల బావులకు నీటిని తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో వ్యవసాయానికి, 80 శాతం ప్రజల తాగునీటి అవసరాలకు మేట్టూరు నీరు వినియోగిస్తున్నారు. 1938 తర్వాత ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర కరువు కాటకాలతో డ్యాంలో 30 అడుగులకు తక్కువగా నీరు ఉంది. రెండు నెలల క్రితం డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం 750 ఘనపుటడుగుల నీరు విడుదలైంది. నీటిరాక తగ్గడంతో ప్రస్తుతం 450 ఘనపుటడుగులు మాత్రమే విడుదల చేస్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక అధికారుల హద్దుమీరిన చర్యలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.