సగం భూమిని చుట్టేశారు!
దేశం కోసం సైన్యంలో పనిచేశారు... ఆ సేవల నుంచి విరామం తీసుకొని విదేశం వెళ్లారు. అక్కడి స్థిరనివాసి అయ్యారు. ఇక శేష జీవితాన్ని గడిపేయడమే తరువాయి అనుకొంటున్న సమయంలో ఆయన ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. 70 యేళ్ల వయసు దాటాకా సగం భూమిని చుట్టేసిన ఘనత ప్రవాసాంధ్రులు మాధవపెద్ది శివరామ్ గారిది...
మిలటరీ టు అమెరికా...
1944లో కృష్జా జిల్లా కంకిపాడు సమీపంలోని పామర్రులో జన్మించాను. తెనాలిలో విద్యాభ్యాసం ముగించాను. 1965లో డిగ్రీ పూర్తి చేశాను. 1966లో ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేశాను. 1972లో కెప్టన్‌గా పనిచేసి రాజీనామా చేశాను. 1972-88 మధ్య హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికా వెళ్లాను. అక్కడ వివిధ రకాల పెద్ద ఉద్యోగాలు చేశాను. 1988లో గ్రీన్‌కార్డు వచ్చింది. 2007లో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను.
భూమి చుట్టూ తిరగాలని...
గుండ్రంగా ఉన్న భూమి చుట్టూ తిరగాలని, కాశీలో తొమ్మిది రాత్రులు నిద్రించాలని కోరికలు ఉండేవి. 70 ఏళ్ల వయస్సులో ఇప్పుడు అవి సాధ్యమా అంటారు కొందరు. కానీ పట్టుదల.. కోరిక.. తపన.. ఉంటే చాలు దేనినైనా సాధించవచ్చు. ఆకాశ మార్గం సగభాగం భూమి చుట్టూ ప్రయాణించాను. కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేశాను.
విహార యాత్రలతో విజ్ఞానం..
ఎంత ఎక్కువగా విహారయాత్రలు చేస్తే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. 70 సంవత్సరాల వయస్సులో కూడా భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నా. తుది శ్వాస వరకు ఎన్ని వీలైతే అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను.
- కోన
సుధాకర్ రెడ్డి