వైకల్యం నేర్పిన నైపుణ్యం!
లాన్‌టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలంటే కదలికల్లో చిరుతపులి పోకడ ఉండాలి, డేగలాంటి చూపుండాలి... అంతకుమించి ఇంకేం అవసరం లేదు అని నిరూపిస్తోంది అహ్మదాబాద్ క్రీడాకారిణి మధుబగ్రీ. ఆ రెండూ ఉన్న ఈమె తన వీల్ చైర్లో కూర్చొనే టెన్నిస్ కోర్టులో చాకచక్యంగా కదులుతోంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించే లాన్‌టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది మధు.
భారతదేశం ఇప్పుడు పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది కానీ... తొంభైల వరకూ చిన్నారులకు అతిపెద్ద శాపం పోలియో. అలాంటి పోలియో బారిన పడిన వారిలో ఒకరు మధు. అయితే దీన్ని ఆమె దురదృష్టం అని అంటే ఒప్పుకోదు. ఎవరైనా సానుభూతి చూపిస్తే సమ్మతించదు. 18 నెలల వయసులోనే పోలియో బారిన పడి, రెండు కాళ్లూ కోల్పోయిన మధుకు జీవితంలోని ప్రతి కష్టమూ చాలెంజింగ్గానే అనిపించింది.
బాల్యంలో తన వయసు ఉన్న పిల్లలతో కలవడాన్ని, తన పనులు తానే చేసుకోవడాన్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుని విజయం సాధించింది. అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆమెకు వేకప్ 2 డ్రీమ్స్ అనే ఎన్జీవో చేయూతనిచ్చింది. స్వతహాగా టెన్నిస్ మీద ఆసక్తి కలిగి ఉన్న మధు వీల్‌చైర్ మీద నుంచి టెన్నిస్ ప్రాక్టిస్ చేయడం ప్రారంభించింది. ఆమెకు పరమేశ్మోడీ అనే కోచ్ సహకారం అందించడంతో ఆటపై నైపుణ్యం సాధించడానికి అవకాశం దొరికింది.
అనునిత్యం చేసిన ప్రాక్టీస్‌తో మధుబగ్రీ అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అయ్యింది. మైదానంలో ఆమె వేగంగా కదిలే తీరు చూస్తే, షాట్ కొట్టే పద్ధతిని గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఈ నైపుణ్యంతో భారతదేశం తరపున వీల్‌చైర్ టెన్నిస్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పటికే బ్యాంకాక్‌లో జరిగిన వీల్‌చైర్ టెన్నిస్టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది మధు. తన వైకల్యమే తనను కార్యసాధకురాలిగా చేసిందని మధు అంటోంది.