అందమైన దృశ్యకావ్యం ఇది
- దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనసు పెట్టి పనిచేయడంతో ఈ చిత్రం అందమైన ‘దృశ్యకావ్యం’లా తయారైంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకన్నా డిఫరెంట్గా ఉంటుంది. ‘ప్రాణం’ కమలాకర్ పాటలు మా చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి’’ అని దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి తెలిపారు. రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై మధునందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మా చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా ప్రతి సీన్ అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది. ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, అలీ, ‘జబర్దస్త్’ టీమ్ వినోదం ఆకట్టుకుంటుంది.
ఆంధ్ర, తెలంగాణలతో పాటు తమిళనాడు, నార్త్ ఇండియాలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రామకృష్ణారెడ్డిగారు కొత్త దర్శకుడైనా సీనియర్ దర్శకుల్లా అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఇప్పటికే సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. కమలాకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్’’ అని మధునందన్ పేర్కొన్నారు. అందరూ ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్ర మిదని హీరో రామ్ కార్తీక్ చెప్పారు. సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్, హీరోయిన్ కశ్మీరా కులకర్ణి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లం సుధారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లు శివనాగేంద్ర రావు.