madhuramma
-
మావోయిస్టు అగ్రనేతల అమ్మ.. మధురమ్మ కన్నుమూత
పెద్దపల్లిరూరల్: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల మాతృమూర్తి మధురమ్మ (96) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూడునెలల క్రితం ఇంటి ఆవరణలో జారిపడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరికపై వెంటిలేటర్‌పైనే పెద్దపల్లిలోని సొంతింటికి తీసుకొచ్చారు. మధురమ్మను పరీక్షించిన వైద్యులు శ్వాస ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. పోరాట కుటుంబం.. మావోయిస్టు అగ్రనేతలు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావుది పోరాట కుటుంబం. తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. తామ్రపత్ర గ్రహీత. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న కోటేశ్వర్రావు 1975లో అడవిబాట పట్టారు. మరో ఐదేళ్ల తరువాత వేణుగోపాలరావు సైతం కోటన్న బాటనే అనుసరించారు. 11ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో.. కిషన్‌జీ పీడిత, తాడిత ప్రజలకోసం సుదీర్ఘకాలం పనిచేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో 2011 నవంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అమరుడయ్యారు. వేణుగోపాల్‌రావు ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మొదట పోలీసులు ఒత్తిడి పెంచినా.. పీపుల్స్‌వార్ గ్రూప్‌లో కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కాలంలో మల్లోజుల కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. 1986లో అప్పటి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. ఆ కోపంతో పోలీసులు వెంకటయ్య, మధురమ్మల ఇంటిని కూల్చివేశారు. ఆ తర్వాత తాటికమ్మలతో గుడిసె వేసుకుని వారు కొంతకాలం జీవనం సాగించారు. 1997 డిసెంబర్ 26న మల్లోజుల వెంకటయ్య మరణించారు. మధురమ్మకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆంజనేయరావు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి విరమణ పొందారు. మిగిలిన ఇద్దరు ‘కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు జనం కోసం పోరాడుతున్నారు.. అలాంటి కొడుకుల కన్నందుకు గర్వంగా ఉంది’ అని మధురమ్మ చెప్పేదని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
పెద్దపల్లి పెద్దవ్వ
జిల్లా కేంద్రం పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుంచి కిలోమీటరు దూరం వెళ్తే బ్రాహ్మణ వీధి వస్తుంది. ఆవీధిలోని ఒక ఇంట్లో.. రెండు మూడేళ్లు తక్కువగా నూరేళ్ల వయసున్న మాతృమూర్తి కనిపిస్తుంది. పేరు మల్లోజుల మధురమ్మ. ఆమె పేరు చెవిన పడని తెలంగాణ ప్రాంతం లేదు. ఉత్తర తెలంగాణలోనైతే ఇంటింటా ‘‘అవును.. మల్లోజుల మధురమ్మ నాకు తెలుసు.. నేను చూశా.. నేను విన్నా’’ అని చెప్పుకునేవారే. కారణం.. ఆ తల్లి జీవితంలో ప్రతి పేజీ ఓ చరిత్రకు ముడిపడి ఉంది. నాడు తెలంగాణ విమోచన పోరాటం నుండి సమసమాజ స్థాపన కోసం నేటికీ జరుగుతున్న ప్రతి పోరాట ఘట్టంలో మల్లోజుల మధురమ్మ పాత్ర పరోక్షంగా ఉంది. ఆమె భర్త మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాష్ట్ర విమోచన ఉద్యమంలో ఒకరయ్యారు. మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు.. అసమానతలు లేని నవసమాజ నిర్మాణం కోసం అడవులు పట్టి వెళ్లారు. ఆ అన్నదమ్ముల్లో ఒక్కరు కిషన్‌జీ అమరుడయ్యారు. మరొకరు మల్లోజుల వేణు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా.. తల్లిగా, తెలంగాణ సాయుధ వీరుడు వెంకటయ్య భార్యగా మధురమ్మ జీవిత విశేషాలు కొన్ని. సమరయోధుని భార్యగా గుర్తింపు మల్లోజుల మధురమ్మ పండు ముసలితనంలోనూ కళ్లద్దాలు లేకుండానే స్పష్టంగా చూస్తుంది. చెవులు వినబడుతాయి. అంతే స్పష్టంగా మాట్లాడుతుంది. కారణం.. ఈ సమాజాన్ని రెండు వైపులా చూసింది. రజాకార్లు, పోలీసులు పెట్టిన వేధింపులు అనుభవించింది. ప్రభుత్వాధికారుల నుండి సన్మానాలు అందుకుంది. సమరయోధుడి భార్యగా ఏటా జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలలో సన్మానాలు అందుకుంటూనే ఉంది. ఇటీవల సాక్షాత్తూ పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు పాదాభివందనం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులంతా మధురమ్మ నుంచి ఆశీర్వాదం అందుకున్నవారే. ఇందుకు భిన్నమైన కోణం కూడా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో రామగుండం మండలం ముర్మూరు వద్ద ప్రభుత్వం వెంకటయ్యకు కేటాయించిన ఏడు ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. భూమికి బదులు భూమిని ఇస్తామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేయడంతో.. మధురమ్మకు అభినందనలు మాత్రమే మిగిలాయి. భర్త ఆచూకీ కోసం చిత్రహింసలు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో మల్లోజుల మధురమ్మ భర్త వెంకటయ్య ఒకరు. నాగపూర్ క్యాంపులో కమ్యూనిస్టు కార్యకర్తగా శిక్షణ పొందిన వెంకటయ్యను రజాకార్లు అరెస్టు చేసి సుల్తానాబాద్ కోర్టులో హాజరుపరిచి వరంగల్ జైలుకు తరలించారు. అంతకు ముందు భర్త ఆచూకీ కోసం మధురమ్మను వారు పెట్టిన చిత్ర హింసలు అన్నీ ఇన్నీ కావు. అడవిబాట పట్టిన కన్నబిడ్డలు తెలంగాణ ప్రాంతం విముక్తి తర్వాత పదేళ్లకు పుట్టిన మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్ద వారైన ఆంజనేయశర్మ ప్రస్తుతం పెద్దపల్లిలోనే పౌరోహిత్యం చేస్తున్నారు. ‘‘చివరిసారి 25 ఏళ్ల క్రితం పోలీసులు నా కొడుకుల జాడ చెప్పా లంటూ ఇల్లు నేలమట్టం చేయడంతో నిరాశ్రయురాలినై తుంగ గుడిసెలోనే నాలుగేళ్లు కాలం గడిపాను’’ అని చెమర్చిన కళ్లతో మధురమ్మ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. – కట్ట నరేంద్రాచారి, సాక్షి, పెద్దపల్లి ఫొటోలు : సతీష్ రెడ్డి అగ్రనేత కిషన్‌జీ ఎనిమిదేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మరణించిన మధురమ్మ రెండో కొడుకు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మావోయిస్టు పార్టీ నిర్మాణ కర్తల్లో ఒకరు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయిన విప్లవ సానుభూతిపరుడు. జగిత్యాల జైత్రయాత్ర నుండి మొదలైన కిషన్‌జీ ప్రస్థానం పీపుల్స్‌వార్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘ కాలం సాగింది. ఆ తర్వాత కేంద్ర కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు. భారత విప్లవోద్యమ పితామహుడైన చారుమజుందార్ సొంత గడ్డ పశ్చిమబెంగాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని కిషన్‌జీ పునరుజ్జీవింపజేశారు. పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలకు ముంబై, ఢిల్లీ, కలకత్తాలకు చెందిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం రావడం విశేషం. -
భూమి కోసం తిరిగి అలసిపోయా..
పెద్దపల్లి: స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా, తనకు 1988లో రామగుండం మండలంలో ఇచ్చిన భూమి దస్త్రాలు ఇప్పటికీ చేతికందలేదని మల్లోజుల మధురమ్మ వాపోయారు. స్వాతంత్య్ర సమరయోధుడైన మల్లోజుల వెంకటయ్య భార్య, మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కిషన్‌జీ, వేణుగోపాల్‌ల తల్లి మధురమ్మను గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మధురమ్మ మాట్లాడుతూ ‘భూమి కోసం 25 ఏళ్లుగా తిరుగుతూ అలసిపోయా.. రామగుండం మండలం ముర్ముర్‌లో సర్వే నం. 126లో 8 ఎకరాల స్థలం కేటాయించి కాగితాలు అప్పగించారు. ఓ ఏడాది వ్యవసాయం చేసుకున్నాం. ఆ తర్వాత పట్టా సర్టిఫికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆశలు వదులుకున్నా. ఇంటికి వచ్చిన ఎస్పీలకు ఈ విషయాన్ని తెలిపితే వెంటనే ఆర్డీవోలతో మాట్లాడిన వారెందరో ఉన్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. 50 ఏళ్లలో వందలసార్లు స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందాయి, ఉద్యమంలో పని చేసిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇచ్చిన భూమి చేతికి దక్కకుండా పోయింది.’అన్నారు. కనీసం 69వ గణతంత్ర వేడుకల సందర్భంగానైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన భూమికి పట్టా సర్టిఫికెట్ల అధికారాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ
కొడుకు జ్ఞాపకాల్లో బతుకుతున్న తల్లి నేడు మావోయిస్టు నేత కిషన్‌జీ రెండో వర్ధంతి పెద్దపల్లి, న్యూస్‌లైన్: సమసమాజ స్థాపన కోసం మూడున్నర దశాబ్దాలు పాలకుల గుండెల్లో నిద్రించిన విప్లవయోధుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ. సాయుధ పోరాటంలో శిఖరమంత ఎత్తు ఎదిగి.. పోలీసుల తూటాలకు కుప్పకూలిన కోటేశ్వర్ రావు విప్లవ బాట పట్టేందుకు తెలంగాణ భావజాలమే బీజాలు నాటింది. విద్యార్థి దశలోనే కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. నాటి పీపుల్స్ వార్ నుంచి..నేటి మావోయిస్టు పార్టీకి మూల స్తంభంగా ఎదిగిన కోటేశ్వర్రావు పాతికేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ప్రహ్లాద్, కిషన్‌జీ పేర్లతో పలు రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని నడిపించారు. కుటుంబమే ధిక్కార స్వరం... కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్రావు కుటుంబ సభ్యులందరిది ధిక్కార స్వరమే. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. రజాకార్లను ఎదురొడ్డిన ధీరుడు. తండ్రి అడుగుజాడల్లో నడచిన కోటేశ్వర్రావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్‌రావు ఆనాడే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా గళమెత్తారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నియమనిష్టలతో జీవనం సాగించాల్సిన అన్నదమ్ములు దళిత, బహుజన బానిస బతుకుల విముక్తి కోసం తుపాకీ పట్టారు. తల్లి మధురమ్మ కూడా భర్తతో పాటు రజాకార్లను ఎదురించింది. రజాకార్లతో జరిగిన సమరంలో వెంకటయ్య అజ్ఞాతవాసం వెళ్లి, జైలు పాలయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత విడుదలయ్యారు. అప్పటినుంచి వెంకటయ్య కుటుంబం పదిహేనేళ్లపాటు ప్రశాంతంగా ఉంది. 1969లో జై తెలంగాణ సభ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో వెంకటయ్యతో పాటు ఆయన కొడుకులు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌లు ఉద్యమగొంతుకలై సర్కారును నిలదీశారు. 1969లో టీపీఎస్(తెలంగాణ ప్రజా సమితి) నాయకత్వాన పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో జై తెలంగాణ సభపై పోలీసులు దాడి చేసి, లాఠీచార్జి చేశారు. నాడు మల్లోజు కోటేశ్వర్‌రావుతో పాటు మరికొందరు యువకులు జైలు పాలయ్యారు. మిగిలినవారు విడుదల కాగా, కోటేశ్వర్రావు జైల్లోనే ఎక్కువ కాలం గడిపి విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో రమేజాబీ, జిజియాబాయి అనే మిహళలు పోలీసుల లైంగికదాడికి గురయ్యారు. ఈ సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బస్సును దగ్ధం చేశాయి. ఈ కేసులో కోటేశ్వర్రావు మరోసారి అరెస్టయి వరంగల్ జైలుకు వెళ్లారు. తెలుగు మహాసభ, విరసం వంటి సంస్థలతో కొనసాగిన అనుబంధంతో కోటేశ్వర్రావు విప్లవోద్యమానికి మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి విప్లవోద్యమంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. సమ సమాజ స్థాపన కోసం ఎక్కుపెట్టిన ఆయుధంతో పాల కుల గుండెల్లో నిద్రించిన కిషన్‌జీని పట్టుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు 36 ఏళ్లు పట్టింది. 2011 డిసెంబర్ 24న బెంగాల్ రాష్ట్రంలోని మిద్నాపూర్‌లోని కలోని అడవుల్లో కేంద్ర బలగాల చేతిలో హతమయ్యారు. హైదరాబాద్‌లో నేడు వర్ధంతి సభ.. ఈనెల 24తో కిషన్‌జీ ఎన్కౌంటర్లో అమరుడై రెండేళ్లు నిండుతున్నాయి. ఆయన రెండో వర్ధంతి సభను హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘాలు, విరసం సంయుక్తంగా నిర్వహిస్తుం డగా తిథి, వార నక్షత్రం ప్రకారం డిసెంబర్ 2న ఆయన కుటుం బ సభ్యులు రెండో వర్ధంతి జరుపుతున్నారు. రాష్ట్రం చూడకముందే పొట్టన పెట్టుకున్నరు.. కొడుకును చెంప మీద ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకున్న.. జై తెలంగాణ అంటూ టీపీఎస్ మీటింగ్‌కు వెళ్లి పోలీసుల నుంచి దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడంతో నా కొడుకు పడ్డ శ్రమకు, వాడు తిన్న లాఠీ దెబ్బలు వృథా పోలేదు. కాని తెలంగాణ రాష్ట్రం చూడకముందే కొడుకు కోటన్నను సర్కారు పొట్టనబెట్టుకుంది. మాయన వెంకటయ్య తెలంగాణ రజాకార్ల పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని చూశారు. స్వాతంత్య్ర సమరయోధులుగా నలుగురిలో సంతోషంగా గడిపారు. కాని కొడుకు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పూటయినా గడపకపోవడం విషాదం. ఆదివారంతో కొడుకు మరణించి రెండేళ్లు అవుతుంది. కొడుకు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మదినిండా కదులుతున్నాయి. అన్న వెనుకే నా చిన్న కొడుకు వేణు కూడా అడవిలోకి పోయింది. అడవిలో ఉన్న చిన్న కొడుకు వేణును ఒక్కసారి చూడాలని ఉంది. - మల్లోజుల కోటేశ్వర్రావు తల్లి మధురమ్మ