35 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది!
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కాలరెగరేసింది. మరోసారి టాలీవుడ్ కాలరెగరేసింది. వరల్డ్ సినిమాతో పోటీపడి మరీ ‘రక్తం’ అనే తెలుగు సిన్మా 22వ ‘ఇండీ గేదరింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (అమెరికన్)లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది. ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక–నిర్మాతలు సునీతాకృష్ణన్, రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమా తీశారు. ఫీచర్ ఫిల్మ్–నిర్మాత సునీతాకృష్ణన్, డైరెక్టర్–రాజేశ్ టచ్‌రివర్, లీడ్ యాక్టర్–బెనర్జీ, లీడ్ యాక్ట్రెస్–మధుశాలిని, సినిమాటోగ్రాఫర్–రామతులసిలకు నామినేషన్లు దక్కాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నటుడు బెనర్జీలతో ఇంటర్వ్యూలు....
♦ కంగ్రాట్స్ బెనర్జీగారు.... ఎలా అనిపిస్తోంది?
థ్యాంక్స్! అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో తెలుగు నటుడికి నామినేషన్ రావడం అరుదైన విషయం. అదీ మన దేశం నుంచి నామినేషన్ దక్కించుకుని హాలీవుడ్ నటులతో పోటీపడుతున్నది నేనొక్కడినే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు, కళామతల్లికి కృతజ్ఞతలు. అలాగే, మా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నిర్మాత సునీతాకృష్ణన్, సహనిర్మాత మున్షీ రియాజ్ అహ్మద్, ‘రక్తం’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
♦ రాజేశ్ టచ్‌రివర్ ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాలు తీశారు. ఆయన మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరేమైనా ఆలోచించారా?
రాజేశ్‌తో నాకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. నన్ను, నా నటనను నమ్మి ‘రక్తం’లో లీడ్ రోల్‌కి సంప్రదించారు. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశా. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించి 35 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లూ ఇటువంటి సినిమా చేయాలని, ఇటువంటి పాత్రలో నటించాలని ఎదురుచూశా. నా 35 ఏళ్ల ఆకాంక్ష ‘రక్తం’తో తీరింది.
♦ మీరు కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంటారు. ఓ ఆఫ్–బీట్ సినిమా చేయడం రిస్కేమో అనుకున్నారా?
నటులెప్పుడూ మంచి క్యారెక్టర్స్ వస్తే ఎగ్జయిటవుతారు. తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. నేనూ అంతే. ఎవరూ డబ్బు గురించి ఆలోచించరు. ముఖ్యంగా నేను! 30 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఎన్నో పాత్రలు చేశా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేషన్ వచ్చేంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ వస్తే ఎందుకు వదులుకుంటాను? నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాత్ర ఇది. కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందేమో? రిస్కేమో! అనుకోలేదు. ‘రక్తం’ చూశాక దర్శక–రచయితలు నా కోసం మరిన్ని మంచి పాత్రలు రాస్తారని నమ్ముతున్నా!
♦ ∙‘ప్రాణాలు తీయడం ద్వారా విప్లవం తీసుకురాలేం’ అనే కథాంశంతో ‘రక్తం’ తీశానని రాజేశ్ టచ్‌రివర్ చెప్పారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఓ దళానికి నాయకుడిగా కనిపిస్తా. అందులో యువతీయువకులు, వయసైనవారు, బాగా చదువుకుని మంచి భావాలతో వచ్చినవారు... ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. మధ్య ఎవరైనా మరణిస్తే ‘అయ్యో పాపం’ అని కొందరు అంటే... ఏది ఏమైనా హైకమాండ్ అప్పగించిన పనిని పూర్తి చేయాలని మరికొందరు అంటారు. వాళ్లకు పరిస్థితులు అర్థమయ్యేలా వివరిస్తూ, అందర్నీ సమన్వయం చేసే పాత్ర. ఈ క్రమంలో మన విప్లవాన్ని ప్రజలు వ్యతిరేకించేలా, అసహ్యించుకునేలా ఉండకుండా చూసుకునే పాత్ర.
♦ మీరు ఎంతో అనుభవమున్న నటుడు... రాజేశ్ టచ్‌రివర్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాదు. సెట్లో మీ ఇద్దరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది?
ఆయన ప్రతి సీన్ డిస్కస్ చేసి, నటించి చూపించమనేవారు. నచ్చితే బాగుందనే వారు. ఒకవేళ చిన్న చిన్న మార్పులుంటే చెప్పేవారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా నుంచి ‘ది బెస్ట్ యాక్టింగ్’ తీసుకున్నారు. దర్శకుల్లో కమర్షియల్, ఆఫ్ బీట్ తేడాలు ఉండవు. నటీనటుల ప్రతిభను తెరపైకి తీసుకొచ్చేది వాళ్లే. ‘అంతా నాకే వచ్చు’ అనుకుంటే నా నటనలో మొనాటనీ వచ్చేస్తుంది. దర్శకులు చెప్పింది చేశాను కాబట్టే.. ఇన్నేళ్లుగా వైవిధ్యమైన పాత్రలు చేయగలిగాను. ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు సినిమా రంగంలో కొత్త మార్పులొస్తున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ.
అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది?
♦ కంగ్రాట్స్ రాజేశ్‌గారు...
ఐయామ్ హ్యాపీ! ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడుతూ ఓ తెలుగు సినిమాకు అవార్డు రావడం, నటీనటులకు నామినేషన్స్ రావడం పెద్ద విషయమే కదా. ఆనందంగా ఉంది.
♦ ‘రక్తం’ కథేంటి? ఈ సినిమాలో మీరు ఏం చెబుతున్నారు?
ఫ్రెంచ్ తత్వవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆల్బర్ట్ కామ్స్ 1949లో రాసిన ‘లెస్ జస్టిస్’ నాటకం స్ఫూర్తితో ‘రక్తం’ తీశా. అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదనిపించింది. చత్తీస్‌ఘడ్‌లో గతేడాది కొందరు పోలీసులను మావోయిస్టులు చంపేశారు. విప్లవం పేరుతో పలు దేశాల్లో ఇటువంటి మారణహోమాలు జరుగుతున్నాయి. ఓ మనిషిని చంపడం ద్వారా విప్లవం తీసుకురాలేరనే సందేశంతో ‘రక్తం’ రూపొందించా. చంపకుండా కూడా విప్లవం తీసుకురావొచ్చు. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? అనేది నా ప్రశ్న.
♦ ‘నా బంగారు తల్లి’, ఇప్పుడీ ‘రక్తం’... ఓ సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలే తీస్తున్నారెందుకు?
నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంది. గద్దర్‌గారు పాట ద్వారా, జర్నలిస్టులు వార్తల ద్వారా, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పద్ధతుల ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఓ దర్శకుడిగా నా సినిమాల ద్వారా ప్రజలకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ, సెన్సిబిల్ సిన్మాలు తీయాలనేది నా నిర్ణయం!
♦ ‘నా బంగారు తల్లి’కి వచ్చిన అవార్డులు–రివార్డులు పక్కన పెడితే, ప్రేక్షకుల స్పందన పట్ల మీరు హ్యాపీనా?
మూడు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు, పదిహేను అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. థియేటర్లలో 25 రోజులు ఆడింది. టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్కో నెల్లో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేశారు. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి!
♦ ‘రక్తం’ సిన్మాను ఎప్పుడు విడుదల చేస్తారు?
మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఇంకా బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సిన్మాను పంపించాలనుకుంటున్నా.