Aryna Sabalenka: సూపర్ సబలెంకా
మాడ్రిడ్: గాయం కారణంగా ఒకదశలో మాడ్రిడ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని ఆలోచించిన బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా బరిలోకి దిగాక ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–0, 3–6, 6–4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది.
మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్. ‘రెండు వారాల క్రితం స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్లో గాయపడ్డాను. కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. దాంతో మాడ్రిడ్ ఓపెన్ నుంచి వైదొలగాలని భావించాను. కానీ నా వైద్య బృందం నాలుగు రోజుల్లో నన్ను కోలుకునేలా చేసింది. ఇప్పుడు మీ ముందర ట్రోఫీతో నిల్చున్నాను’ అని క్లే కోర్టులపై తొలిసారి టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల సబలెంకా వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచన సబలెంకాకు 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 81 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, షాంపేన్ బాటిల్ లభించాయి.