మరో నన్నయ.. మధునాపంతుల
వర్ధంతి సభలో ప్రముఖుల నివాళులు
రాజమహేంద్రవరం కల్చరల్ : ఈ గడ్డపై నడయాడిన మరో నన్నయ మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఆయన ఋషి తుల్యుడని సాహితీవేత్త గొడవర్తి నరసింహాచార్య అన్నారు. మధునాపంతుల ట్రస్టు సౌజన్యంతో ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సాహితీ శరత్ కౌముది ఉత్సవాలలో భాగంగా సోమవారం జరిగిన మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి వర్ధంతి సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మధునాపంతుల రచించిన ఆంధ్ర రచయితలు గ్రంథ ప్రాశస్త్యాన్ని నరసింహాచార్య వివరించారు. అందులో 113 మంది తెలుగు కవుల జీవిత చరిత్రలను మధునాపంతుల స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు. ‘మనం సాధారణంగా గురజాడ వేంకట అప్పారావు అంటాం. ఇది సరి కాదు. గురుజాడ వేంకట అప్పారావు అని అనాలి. ఆ మహాకవి ఇంటిపేరు గురుజాడ అని మధునాపంతుల సిద్ధాంతీకరించారు’ అని ఆయన అన్నారు. సాక్షి రచనల పానుగంటి లక్ష్మీ నరసింహారావుకు షష్టిపూర్తి వేడుకలు జరపాలన్న ఆలోచనలు తెలుగువాడికి రాకపోవడం దురదృష్టమని మధునాపంతుల పేర్కొన్నారన్నారు. ‘గిడుగు రామ్మూర్తి పంతులు మహాబధిరుడు. ప్రతిపక్షులు ఎన్ని విమర్శలు చేసినా, ఆయన లక్ష్యపెట్టలేద’ని మధునాపంతుల గిడుగు రామ్మూర్తి పంతులు మీద రచించిన వ్యాసంలో తెలిపారని నరసింహాచార్య వివరించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని మధునాపంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తనయుడు మధునామూర్తి, ఆయన తమ్ముడు సూరయ్యశాస్త్రి కుమారుడు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, తెలుగురథం వ్యవస్థాపకుడు కొంపెల్ల శర్మ, పీవీబీ శర్మ, కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్, సంస్కృత ఉపన్యాసకురాలు కామేశ్వరి పాల్గొన్నారు.