బెజవాడ విల్సన్, టీఎం కృష్ణకు రామన్ మెగసెసె
న్యూఢిల్లీ : ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె పురస్కారానికి ఈ ఏడాది కూడా ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. 2016 సంవత్సరానికిగానూ సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, ప్రసిద్ధ కర్ణాటక విద్వాంసుడు టీఎం కృష్ణకు మెగసెసె అవార్డు లభించింది. ఈ మేరకు రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ కమిటీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది.
కాగా కర్ణాటకలో ఓ దళిత కుటుంబంలో పుట్టిన విల్సన్ దళిత కార్మికులు చేతులతో మల మూత్రాలను ఎత్తివేయడం చూసి అలాంటి దురాచారాన్ని అరికట్టే ఉద్యమంలో భాగంగా 'సఫాయి కర్మచారి ఆందోళన్' సంస్థను ప్రారంభించారు. ఆయన విద్యాభ్యాసం ఆంధ్రపద్రేశ్ లో కొనసాగింది. ఇక టీఎం కృష్ణ చెన్నై నివాసి.
వీరితో పాటు మరో నలుగురు విదేశీయులు కూడా అవార్డు గెలుచుకున్నారు. ఫిలిప్పైన్స్కు చెందిన కొంచితా కార్పియో, ఇండోనేషియాకు చెందిన డొంపెట్ దువాఫా, జపాన్ ఓవర్సీస్ కోఆపరేషన్ వలంటీర్స్, లావోస్కు చెందిన వియెంటియానె రెస్క్యూలను మెగసెసె అవార్డు వరించింది. ఫిలిపైన్స్ మాజీ ప్రెసిడెంట్ రామన్ మెగసెసె జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది ఆసియా ప్రజలకు నిస్వార్ధ సేవలందించిన వ్యక్తులకు ఈ రామన్ మెగసెసె అవార్డును అందజేస్తారు.