మస్కట్లో కొమరల్తాడ వాసి మృతి
కొమరల్తాడ(వజ్రపుకొత్తూరు): పేదరికాన్ని అధిగమించేందుకు దేశం కాని దేశం వెళ్లాడు.. చేసిన అప్పులు తీరకముందే అక్కడ విగతజీవిగా మారి భార్య పిల్లలకు, కన్నవారికి తీరని శోకం మిగిల్చాడు.. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే అందనితీరాలకు వెళ్లిపోవడంతో భోరున రోదిస్తున్న భార్య, కుటుంబ సభ్యులను చూసిన వారికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొమరల్తాడ గ్రామానికి చెందిన మాగుబరి రామారావు (37) ఐదు నెలలుగా మస్కట్లోని డాల్ఫిన్ ఇంజినీరింగ్ కంపెనీలో స్టీల్ ఫిక్స్ర్గా పని చేస్తున్నాడు.
అయితే ఆయన సోమవారం చనిపోగా.. కంపెనీ అధికారులు ఆలస్యంగా గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఎలా చనిపోయాడో కూడా తెలియరాలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. సోమవారం చనిపోయినప్పటికీ కంపెనీ అధికారులు ఎవరూ సమాచారం అందించలేదని చెప్పారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విషయం బయటపడిందని, దీంతో అక్కడ ఉన్న తెలుగు వారు గురువారం రాత్రి తమకు సమాచారం ఇచ్చారని రామారావు కుటుంబ సభ్యులు చెప్పారు.
అక్కడ ఉన్న తమ గ్రామానికి చెందిన వారిని పంపించి మృతదేహం స్వగ్రామానికి తెచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. రామారావుకు పదేళ్ల కిందట వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామానికి చెందిన నాగమ్మతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు సాయి, ఆరు నెలల పాప శరణ్య ఉన్నారు. మృతుని తండ్రి నీలాద్రి చనిపోగా తల్లి లక్ష్మిమ్మ, వికలాంగుడై తమ్ముడు ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం తీసుకువచ్చేలా అధికారులు కృషి చేయాలని సర్పంచ్ చింత రాజు తదిరులు కోరారు.