'నా ఇంజనీరింగ్ పట్టా బోగస్ కాదు'
ముంబై: నకిలీ డిగ్రీ పట్టాను ఆధారంగా చూపి మంత్రి పదవి పొందారన్న ఆరోపణలపై మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే వివరణ ఇచ్చారు. సోమవారం ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
'పలు వార్తా ఛానెళ్లు ప్రసారం చేసినట్లు నా గ్రాడ్యుయేషన్ పట్టా నకిలీది కాదు. సత్యప్రమాణకంగా నిజమైందే. పుణేలోని ధ్యానేశ్వరీ విద్యాపీఠంలోనే నేను బీఈ ఎలక్ట్రానిక్స్ చదివాను. 1980 నుంచి 1984 వరకు నేనక్కడ చదువుకున్నా. అయితే అప్పట్లో మా కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉండేదికాదు. దూర విద్యావిధానం కిందికి వచ్చే కోర్సులో చేరేముందు ఈ విషయాన్ని టీచర్లు కూడా మరోసారి గుర్తుచేశారు. గుర్తింపులేని డిగ్రీ చదవాలో లేదో మమ్మల్నే నిర్ణయించుకోమని చెప్పారు కూడా.
అప్పట్లో ధ్యానేశ్వరీ విద్యామందిర్ ప్రవేశపెట్టిన ఈ కోర్సుపై కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా వారికే అనుకూలంగా వచ్చింది. అందుకే మా డిగ్రీ సర్టిఫికేట్లు చెల్లకుండా పోయాయి. కానీ నేను కోర్సు చదివింది మాత్రం నిజం' అంటూ తన విద్యార్హతపై వివరణ ఇచ్చారు వినోద్ తావ్డే. కాగా, తావ్ డే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని మహారాష్ట్ర ప్రతిపక్షనేత రాధాకృష్ణ పాటిల్ డిమాండ్ చేశారు.
నకిలీ డిగ్రీ పట్టా కేసులో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జైలు పాలైన నేపథ్యంలో అన్నిరాష్ట్రాల్లో మంత్రుల విద్యార్హతలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.