విశ్వరూప మహా గణపతి
ఈ సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం
60 సంవత్సరాల సందర్బంగా 60 అడుగుల ఎత్తులో దర్శనం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ‘శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పున తామరపువ్వుపై దశ బాహువులతో నిల్చున్న త్రిముఖ గణపతికి ఇరువైపులా శివపార్వతుల శిరసులు ఉంటాయి. వెనుక ఏడు తలల సర్పం.. దానికి ఇరువైపులా కుమారస్వామి, అయ్యప్ప (12 అడుగుల ఎత్తు చొప్పున) ఉంటారు. ఇక, కింద రెండుపక్కలా సిద్ధి-బుద్ధి విగ్రహాల (ఒక్కొక్కటి 15 అడుగుల ఎత్తు)తో పాటు శివుడు, పార్వతి, వినాయకుల వాహనాలైన నంది, సింహం, ఎలుక రూపాలు ఉంటాయి.
వినాయకునికి కుడి, ఎడమల్లో 20 అడుగుల చొప్పున ఎత్తులో లక్ష్మీనర్సింహస్వామి, దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పడి 60వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి 60 అడుగుల గణపతి విగ్రహాన్ని రూపుదిద్దుతున్నట్టు కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మహా గణపతి నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. కార్యక్రమంలో శిల్పి రాజేంద్రన్, ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్, సభ్యులు సందీప్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
40 శాతం పనులు పూర్తి
1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నాను. ఈ ఏట మహా గణపతికి షష్ఠి పూర్తి సందర్భంగా శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే 40 శాతం వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. జూలై 4 నుంచి పనులు మరింత ఊపందుకుంటాయి.
- శిల్పి రాజేంద్రన్
అదృష్టం దక్కింది
60 ఏళ్ల ఖైరతాబాద్ మహా గణపతికి ప్రతి రూపాన్ని చిత్రించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. శిల్పి రాజేంద్రన్ సూచనల మేరకు పూర్తి స్థాయి రూపాన్ని తెచ్చేందుకు నాలుగు రోజులు పట్టింది. మహా గణపతి ఆశీస్సులతోనే దిగ్విజయంగా పని పూర్తిచేశాను.
- ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్