నకులసహదేవులు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 16
నకులసహదేవులు కవలపిల్లలు. అశ్వినీ దేవతల వల్ల మాద్రికి పుట్టినవాళ్లు. సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల పుట్టిన అశ్వినులు కూడా కవలలే. అశ్వినుల్ని దివిభువులనీ రాత్రిం బగళ్లనీ శ్వాసప్రశ్వాసలనీ చెబుతారు గనక వాళ్లు ద్వంద్వాలకు ప్రతినిధులు. వీళ్లిద్దరూ అందంగా ఉండడం వల్లనే వీళ్లవల్ల పుట్టిన నకులసహదేవులు కూడా చాలా అంద గాళ్లు. కవలపిల్లల్ని సంస్కృతంలో ‘యమౌ’ అని అంటారు. ‘యమౌ’ అంటే, యోగ భాషలో ‘యమ నియమాల’నే మొదటి రెండు యోగాంగాలూను.
యమాలంటే హింసిం చకుండా ఉండడమూ దొంగతనానికి పాల్పడకపోవడమూ వీర్యాన్ని కాపాడు కుంటూ ఉండడమూ అబద్ధం చెప్పకుండా ఉండడమూ కావలసినదాని కన్నా ఎక్కువగా పోగు చేసుకోకపోవడమూ మొదలైనవి. నియమాలంటే, లోపలా బయటా శుచిగా ఉండడమూ ఉన్నదానితో సంతృప్తిపడుతూ అనవసరమైన వాటి కోసం వెంపర్లాడ కుండా ఉండడమూ కోరికల్ని విడిచిపెట్టి క్రమశిక్షణతో ఉండడమూ విశ్వమంతా విస్తరించి ఉన్న చైతన్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండడమూ విశ్వాన్ని సృష్టించిన మహాచైతన్యానికి తన సర్వస్వాన్నీ సమర్పించే భావాన్ని పెంపొందించుకోవ డమూ మొదలైనవి.
యమనియమాలను వినగానే వీటివల్లనే ఆరోగ్యం కలుగు తుందని తెలిసిపోతుంది. ఆరోగ్యం అందా నికి మూలం. అశ్వినులు ఈ ఆరోగ్యమనే అందాన్నిచ్చే వైద్యులు. వాళ్ల కొడుకుల అందం గూడా ఈ యమనియమాల ప్రభావం వల్లనే సిద్ధించింది.
యమనియమాల్లాగే శమదమాలు కూడా కవలలే. దమమంటే బయటి పది ఇంద్రియాలనూ అదుపులో ఉంచుకో వడం; శమమంటే లోపలి ఇంద్రియమైన అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోవడం. అంతఃకరణమంటే మనస్సూ బుద్ధీ చిత్తమూ అహంకారమూ అనే నాలుగుగా మనం చెప్పుకొనే ఒకే ఇంద్రియం. యమనియమాలూ దమశమాలూ అనే కవల లక్షణాలకు సహదేవనకులులు ప్రతీకలు. ఆధ్యాత్మికతకు మూలమైన ఆధారాలు దమమూ యమమూను. అంచేతనే వీటిస్థానం మూలాధారం.
ఇది సహదేవుడి స్థానం. దేవతలంటే సృష్టిలోని వస్తువుల్ని ప్రకాశింపజేసేవాళ్లు. ఆ పని చేసేవి మన ఇంద్రియాలు. అంచేత దేవత లంటే ఇంద్రియాలన్నమాట. ‘షహ- మర్షణే’, అంటే, సహించడమూ ఓర్చుకోవ డమూను. అంచేతనే, ఇంద్రియాల ఒత్తిళ్లను ఓర్చుకొనే శక్తే ‘సహదేవుడు’, అంటే, దమం. ఆధ్యాత్మికతకు అధిష్ఠా నాలు శమమూ నియమమూను. అంచే తనే వీటి స్థానం స్వాధిష్ఠానం. ఇది నకు లుడి స్థానం. ఇంద్రియ కులానికి బంధువు మనస్సు. మనస్సుకు అనుకూలంగా ఉండనివాడే - ‘న(అను)కూలుడు’, అతనే నకులుడు. మనస్సు అశాంతికి పెట్టింది పేరు. అందుకే నకులుడు శాంతికి, అంటే, శమానికి ప్రతీక. ధర్మరాజుతో సమానుడు.
ప్రశాంతికి మారుపేరైన ధర్మరాజు, తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయయాగం చేద్దామనుకొన్నాడు. ఆ యాగం చేయా లంటే రాజులందర్నీ జయించాలి. దాని కోసం అతని నలుగురు తమ్ముళ్లూ నాల్గు దిక్కులనూ జయించుకొని వచ్చారు. వాటిలో పడమర నకులుడి భాగమైంది; దక్షిణం సహదేవుడి భాగమైంది. పడమటి దిక్కంటే, వాసుదేవ కృష్ణుడి అధికారంలో ఉన్న దిక్కు. కృష్ణుడు పాండవుల మీది ప్రేమకొద్దీ నకులుడికి కానుకలు పంపాడు. అలాగే అటే ఉన్న మద్రదేశానికి అధిపతి అయిన శల్యుడు, మేనల్లుడి మీది ప్రేమ కొద్దీ తానే స్వయంగా నకులుడి వశంలోకి వచ్చాడు.
సహదేవుడు దక్షిణదిక్కుకు పోతూ కిష్కింధ గుహకు వెళ్లాడు. అక్కడ ద్వివిదమైందవులతో యుద్ధం జరిగింది. నకుల సహదేవులకు మల్లేనే మైందద్వి విదులనే వానర రాజులిద్దరూ కూడా అశ్వినీపుత్రులే. వాళ్లు ఏడురోజులు యుద్ధం చేసి సహదేవుడి శౌర్యానికి సంతో షిస్తూ, ధర్మరాజుకోసం రత్నాలను కాను కలుగా ఇచ్చారు. ‘అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే’ అని దీవించి సహ దేవుణ్ని పంపారు.
మాహిష్మతీనగర రాజు నీలుడికి అతని అల్లుడైన అగ్ని బాసటగా నిలిచాడు. అగ్ని తన సేనను కాల్చడాన్ని చూసి, సహదేవుడు అగ్నిని స్తుతి చేశాడు. రాజసూయయాగం చేద్దామనుకుంటూన్న ధర్మరాజుకు ‘యజ్ఞవిఘ్నమిమం కర్తుం నార్హస్త్వం హవ్యవాహన’ అని ప్రార్థించ గానే, సహదేవుణ్ని ఊరడిస్తూ అగ్ని తప్పు కొన్నాడు. అప్పుడు నీలుడు, అగ్ని ఆజ్ఞతో సహదేవుణ్ని సత్కరించి అతనికే విజయ మని ఘోషించాడు.
దక్షిణ సముద్ర తీరానికి వచ్చి, విభీషణుడికి ధర్మరాజు యాగాన్ని గురించి కబురు పంపాడు. కబురందుకోగానే అతను రత్నాలనూ దివ్యమైన ఆభరణాల్నీ ఖరీదైన బట్టల్నీ ఉపాయనాలుగా పంపాడు. అలా నకుల సహదేవులిద్దరూ పశ్చిమ దక్షిణాలను జయించి ధర్మరాజు యాగానికి దోహదం చేశారు. రాజసూయంలో భీష్ముడు ధర్మ రాజుతో ఒకానొక అర్హుడికి అగ్రపూజ చేయాలని గుర్తుకు తెచ్చాడు. యుధిష్ఠి రుడు తాతగార్నే ఆ అగ్రపూజకు అర్హు డెవరో నిర్ణయించమని ప్రార్థించాడు.
అప్పుడతను శ్రీకృష్ణుడే అర్హణీయతముడని నిర్ణయించాడు: ఏష హ్యేషాం సమస్తానాం తేజోబలపరాక్రమైః!/మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కరః!!/ అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా!/ భాసితం హ్లాదితం చైవ కృష్ణేసేదం సదో హి నః!!’ (సభాపర్వం 36-28, 29): జ్యోతిర్మండలాల్లో సూర్యుడి మాదిరిగా అందరిలోకీ తేజస్సుతోనూ బలంతోనూ పరాక్రమంతోనూ ప్రకాశిస్తూన్నవాడు ఈ శ్రీకృష్ణుడే.
సూర్యుడు లేక చీకటిలో అలమటిస్తూన్న లోకాన్ని సూర్యుడు తన వెలుగులతో ఎలాగ ముంచెత్తుతాడో అలా లోకాల నన్నిటినీ తేజశ్శక్తులతో నింపుతున్నాడు ఈ శ్రీకృష్ణుడు. గాలి లేనిచోట జీవం చచ్చి పోతుంది, ఉండనే ఉండదు. అటువంటి గాలి లేనిచోట గాలి సంచరించడం మొదలుపెడితే, ఎలాగ జీవాలన్నీ ఆనం దిస్తాయో అలాగ అందరినీ ఆహ్లాదంలో మునిగేలాగ చేస్తాడు ఈ శ్రీకృష్ణుడు. ఈవిధంగా శ్రీకృష్ణుణ్ని అగ్రపూజకు తగినవాడిగా ఘోషించగానే సహదేవుడు పూజాసామగ్రిని పట్టుకొని సభలోకి వచ్చాడు.
సరిగ్గా అప్పుడే దానికి శ్రీకృష్ణుడి మేనత్తకొడుకు శిశుపాలుడు ఆక్షేపణ తెలుపుతూ అడ్డగించాడు: ‘ఆచార్యుడు గానీ ఋత్విక్కుగానీ సంబంధీకుడు గానీ శ్రుతిశాస్త్రస్నాతకుడు గానీ ప్రియమిత్రుడు గానీ ఒక మహారాజు గానీ అర్ఘ్యానికి అర్హులు. యాదవకులంలో పుట్టిన శ్రీకృష్ణుడికి రాజ్యార్హతే లేదు. పెద్దవాడం దామా దానికి అతని తండ్రి వసుదేవుడు న్నాడు. ప్రియమిత్రుడందామా దానికి ద్రుపదుడున్నాడు.
అదీగాక ఋత్విక్కైన వ్యాసుడుండగా ఇతన్ని అర్హుడని ఎలాగన గలం? దుర్యోధనుడూ కృపాచార్యుడూ ద్రోణాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ ఏక లవ్యుడూ శల్యుడూ అనే మహామహా పరాక్రమవంతులుండగా కృష్ణుణ్ని ఈ పూజకు ఎన్నుకోవడం సబబు కానేకాదు’ అంటూ ధ్వజమెత్తాడు. ధర్మరాజూ భీష్ముడూ ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వితండంగా వాదిస్తూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడు నిండు సభలో అతిధైర్యంగా, అప్రమేయమైన పరాక్రమమున్న శ్రీకృష్ణుణ్ని పూజార్హుడిగా సహించలేనివాళ్లెవరున్నా వాళ్ల తలమీద ‘ఇదుగో నా పాదం పెడతాను’ అని భీకరంగా పలికాడు:
‘పూజ్యమానం మయా యో వః కృష్ణం న సహతే నృపాః!/సర్వేషాం బలినాం మూర్ధ్ని మయేదం నిహితం పదమ్!!’ (సభాపర్వం 39-2,3). అందరి మధ్యలో సహదేవుడు తన పాదాన్ని ఎత్తి చూపించగానే వాళ్లలో ఎవ్వరూ పెదవి మెదపలేదు. మూగ వాళ్లలా చతికిలపడి పోయారు. దీనికి కారణం యమనియ మాలు దృఢం కావడంతో సహదేవుడికి నైతిక ధైర్యం ప్రబలడమే. అప్పుడు సర్వ సంశయాల్నీ పోగొట్టే నారదుడు ఇలా ముక్తాయించాడు:
‘కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యన్తి యే నరాః!/జీవన్మృతాస్తు తే జ్ఞేయా న సంభాష్యాః కదాచన!!’ (సభాపర్వం 39-9). కృష్ణపూజను చేయనివాడు బతి కుండీ చచ్చినవాడితో సమానం. అటు వంటివాడితో మాట్లాడటం కూడా అప రాధమే అని తేల్చి చెప్పాడు.
భీముడూ నకులసహదేవులూ కలిసి శకునినీ అతని కొడుకు ఉలూకుణ్నీ ఎది రించిన సమయంలో సహదేవుణ్ని శకుని ఒక ఈటె వేసి రథంలో కూలిపోయే లాగ చేశాడు. అప్పుడు భీముడు చేసిన సింహ గర్జనకు శకుని సైనికులందరూ కాందిశీ కులై, అంటే, ఏ దిక్కుకు పోతున్నారో తెలియకుండా పారిపోయారు.
ఇంతలో సహదేవుడు మెలకువ తెచ్చుకొని, శకుని విల్లును విరగ్గొట్టాడు. మరో విల్లు తీసు కొని శకుని నకులుణ్ని అరవై బాణాల తోనూ భీముణ్ని ఆరు బాణాలతోనూ కొట్టాడు. ఉలూకుడు కూడా భీముణ్ని ఏడు బాణాలతోనూ సహదేవుణ్ని డెబ్భై బాణాలతోనూ వేధిం చాడు. అప్పుడు అతికోపంతో సహదేవుడు ఒక భల్లాన్ని వేసి ఉలూకుడి తలను ఉత్తరించాడు. కొడుకు తన ఎదురు గుండానే నేలకొరగ డాన్ని సహించలేక, శకుని సహదేవుడి మీద విరుచుకుపడ్డాడు.
సహదేవుడి విల్లును విరగ్గొట్టాడు. అంతటితో ఊరు కోక ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి సహదేవుడి మీదకు విసిరాడు. దాన్ని మధ్యలోనే రెండు ముక్కలుగా చేశాడు సహదేవుడు. ‘ఎవడైనా క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ బాణాలు వేసి పౌరుషాన్ని చూపిస్తాడు గానీ, నీలాగ సభలో పాచికలతో పందెం వేస్తూ మోసంతో గెలిచి వెకిలిగా నవ్వుతూ వెక్కిరించడు.
ఆ నీచకర్మకు ఫలాన్ని అనుభవించు’ అంటూ సహ దేవుడు శకుని వింటిని విరిచి, గుర్రాల్ని చంపి, ధ్వజాన్ని ముక్కలు చేసి, బాణ వర్షం కురిపించాడు. శకుని ప్రాసం వేయ బోతూంటే సహ దేవుడు ఆ ప్రాసంతో సహా అతని రెండు చేతుల్నీ మూడు భల్లాలతో నరికి, ఆ వెంటనే మరో భల్లంతో అతని తలను ఉత్తరించాడు. శకునిని చంపి, సహదేవుడు మోహాన్ని మోసాన్నీ అంతం చేశాడు.
- డా॥ముంజులూరి నరసింహారావు