ఆదివారం అర్ధరాత్రి
రైల్వేస్టేషన్ దగ్గర చివరి ప్యాసెంజర్ని దింపాక రాంబాబు ఆటోని తన ఇంటి వైపు మళ్లించాడు. ఆ రోజు ఆదివారం. అర్ధరాత్రి దాటింది. రాంబాబు మనసేం బాలేదు. తండ్రికి ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అన్నారు. అందుకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. రాంబాబుకు ఆటో తప్ప మరొక ఆస్తి లేదు. ఆటో పైన కూడా యాభై వేలు అప్పుంది. ఎంత ప్రయత్నించినా అప్పు పుట్టలేదు. ఓ పెద్దాయన హఠాత్తుగా ఆటోకి అడ్డొస్తే సడన్ బ్రేకేసి ఆటో ఆపి, కోపంగా చూశాడు రాంబాబు. బాగా తాగినట్టున్నాడు ముసలివాడు. తూలుతూ వచ్చి ఆటో ఎక్కాడు. మీటర్ తిప్పి ఆటోని ముందుకు కదిలించాడు రాంబాబు. ‘‘ఎక్కడికి?’’ అని రాంబాబు వెనక్కి చూస్తే నిషా ఎక్కువై ముసలివాడు స్పృహ కోల్పోయాడు. తట్టి లేపినా లేవలేదు. ఇక ఆ తాగుబోతుని ఆటోలోంచి దింపేసి తన దారిన తాను వెళ్లిపోవాలనుకున్నాడు రాంబాబు. కానీ రోడ్డు పక్కన దింపేసి వెళితే ఏదైనా వాహనం అతన్ని ఢీకొనవచ్చునని సురక్షితమైన స్థలంలో దింపాలనుకున్నాడు. అర్ధరాత్రి దాటడంతో షాపులన్నీ మూసేసి ఉన్నాయి. జన సంచారమే లేదు. రోడ్డు పక్కన ఓ షాపు ముందు పెద్ద వరండా కనిపించింది. రాంబాబు ఆ షాపు ముందు ఆటో ఆపాడు. అతి కష్టమ్మీద ఆ ముసలివాణ్ని ఆటోలోంచి దింపి వరండాలోకి తీసుకెళ్లాడు. ఓ కట్టమీద అతన్ని పడుకోబెట్టాడు. అంతలో ముసలోడి జేబులోంచి ఓ సెల్‌ఫోన్ కిందపడింది.
రాంబాబు ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు. చాలా ఖరీదైన ఫోనది. దాన్ని బట్టి ఆ తాగుబోతు బాగా డబ్బున్నవాడని రాంబాబుకి అర్థమైంది. అప్పుడే అతనికొక వింత ఆలోచన వచ్చింది. ‘ఈ ముసలివాడు ఎక్కడున్నాడో ఇతని కుటుంబ సభ్యులకు తెలియదు. తెల్లవారేవరకూ ఇతనికి మెలకువ వచ్చేలా లేదు. ఈ స్థితిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడే ఫోన్ చేసి ముసలివాణ్ని కిడ్నాప్ చేసినట్టు అతని కుటుంబ సభ్యుల్ని నమ్మించగలిగితే చాలు. వారు అడిగినంత ఇచ్చేస్తారు.’ అనుకున్నాడు. ఓ నిర్ణయానికి రాగానే రాంబాబు స్విచాఫ్ అయి ఉన్న ఆ సెల్‌ఫోన్‌ని ఆన్ చేశాడు. ‘హోమ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు. అవతల ఫోనెత్తిన వ్యక్తి ఆదుర్దాగా, ‘‘ఎక్కడున్నావు? గంట నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశావు?’’ అన్నాడు. ‘‘చూడు మిస్టర్! మీ నాన్నని కిడ్నాప్ చేశాం. అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఇప్పటికిప్పుడే మాకు లక్ష రూపాయలు తెచ్చివ్వాలి’’ కటువుగా పలికాడు రాంబాబు. ఆ మాటలకు అవతలి వ్యక్తి షాకయ్యాడు. ‘‘మా నాన్ననేం చెయ్యకండి! మీరడిగిన డబ్బు ఇచ్చేస్తాను. ’’ ఆందోళనగా అన్నాడతను. రాంబాబు ముసలతని ఫొటో తీసి ఆ వ్యక్తి ఫోన్‌కు పంపించాడు.
ఫొటో చూడగానే, ‘‘డబ్బు ఎక్కడికి తెచ్చివ్వాలి?’’ అంటూ ఆత్రంగా అడిగాడతను. రాంబాబు ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు – ‘‘కొత్తపేట శ్మశానం వెనక గల పాడుబడ్డ మఠం ముందు ఓ మర్రిచెట్టు ఉంది. అరగంటలోగా అక్కడికొచ్చి ఆ చెట్టు కింద డబ్బు పెట్టి వెళ్లిపో’’. తర్వాత రాంబాబు ఆ వ్యక్తి ఫోన్ నంబర్ని తన సెల్లో సేవ్ చేసుకొని ఆ సెల్‌ఫోన్‌ని ముసలతని జేబులో పెట్టేశాడు. ఆటో దగ్గరికొచ్చి అటూ ఇటూ చూశాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రాంబాబు ఉత్సాహంగా ఆటో స్టార్ట్ చేసి పది నిమిషాల్లో కొత్తపేట శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. ఆటో ఎవరికీ కనబడకుండా చీకట్లో నిలబెట్టి నడుచుకుంటూ మఠం వెనక్కి వెళ్లాడు. ఓ గోడ వెనక నక్కి డబ్బు తెచ్చే వ్యక్తి కోసం ఎదురుచూడసాగాడు. కాసేపట్లో ఓ కారు అక్కడికొచ్చింది. కారులోంచి దిగిన వ్యక్తి ఓ చిన్న బ్యాగుని మర్రిచెట్టు కింద పెట్టాడు. అటూ ఇటూ చూసి కారెక్కి వెళ్లిపోయాడు. రాంబాబు కాసేపు వేచి ఉండి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మర్రిచెట్టు దగ్గరికెళ్లి బ్యాగు తీసుకున్నాడు. బ్యాగు తెరిచి చూస్తే పది వంద నోట్ల కట్టలు కనిపించాయి. రాంబాబు ఉత్సాహంగా ఆటో స్టార్ట్ చేసి ఇంటికి బయల్దేరాడు. దారిలో ఓ పబ్లిక్ బూత్ దగ్గర ఆగాడు. తన ఫోన్లో సేవ్ చేసుకున్న నంబర్‌కి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తగానే, ‘‘మీ నాన్న నెహ్రూ రోడ్‌లోని ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ షాపు వరండాలో ఉన్నాడు. వెంటనే వెళ్లి అతణ్ని ఇంటికి తీసుకెళ్లు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
రాత్రికి రాతే లక్ష రూపాయలు చేజిక్కించుకున్న రాంబాబు మరుసటి రోజే ఆ డబ్బుతో తండ్రికి హార్ట్ సర్జరీ చేయించాడు. కానీ ఆ తర్వాతి రోజే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ‘‘కిడ్నాప్, హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం’’ అన్నాడు ఎస్సై విజయ్. ఆ మాటలు విని రాంబాబు హడలిపోయాడు. ‘‘సార్! నేనెవర్నీ చంపలేదు.’’ అన్నాడు భయంగా.
‘‘ఆదివారం రాత్రి గంగాధర్ అనే వ్యక్తి నీ ఆటోలో ఎక్కిన దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నువ్వతన్ని కిడ్నాప్ చేసి చంపి లక్ష రూపాయలు వసూలు చేశావ్’’ అన్నాడు విజయ్. ‘‘కిడ్నాప్ డ్రామాతో లక్ష రూపాయలు తీసుకున్న మాట నిజమే. కానీ నేనతన్ని చంపలేదు సార్!’’ జరిగినదంతా చెప్పాడు రాంబాబు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక విజయ్‌కి రాంబాబు మాటలపై నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఆదివారం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో గొంతు నులమటం వల్ల గంగాధర్ చనిపోయాడని రిపోర్టులో ఉంది. సరిగ్గా అదే సమయంలో రాంబాబు గంగాధర్ కొడుకు రఘుకి కొత్తపేటలోని పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసినట్టు రఘు ఫోన్ రికార్డుల్ని బట్టి తెలుస్తోంది. ఒకే సమయంలో రాంబాబు రెండు చోట్ల ఉండటం అసాధ్యంగనుక ఈ హత్య రాంబాబు చెయ్యలేదని ఋజువైంది. దాంతో ఎస్సై విజయ్ తన పరిశోధన దిశను మార్చాడు. గంగాధర్ కొడుకు రఘుని పిలిపించి ప్రశ్నించాడు. ‘‘ఆదివారం రాత్రి మీ నాన్న కిడ్నాప్ అయిన విషయం మీతో పాటు ఇంకా ఎవరెవరికి తెలుసు?’’ అని అడిగాడు. ‘‘నా భార్యకీ, చెల్లికీ, బావకి తెలుసు. బావ వినోద్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. కిడ్నాపర్‌కి డబ్బు ఇవ్వడానికి తను కూడా వస్తానన్నాడు. నేనే వద్దన్నాను’’ అన్నాడు రఘు.
‘‘మీ నాన్న వీలునామా రాశాడా?’’ అడిగాడు విజయ్. ‘‘గత ఏడాది అమ్మ పోయాక నాన్న వ్యాపారమంతా నాకు అప్పగించి మిగతా ఆస్తిపాస్తుల్ని నాకూ, చెల్లికి సమానంగా పంచుతూ వీలునామా రాశాడు. ఆయనకి మేమిద్దరమే సంతానం’’ అన్నాడు రఘు. వీలునామా విషయం తెలిసాక ఎస్సై విజయ్ వినోద్ గురించి కూపీ లాగాడు. ఈ మధ్య వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో వినోద్ పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయాడని తెలిసింది. విజయ్ వెంటనే వినోద్‌ని స్టేషన్‌కి పిలిచి కటువుగా ప్రశ్నించాడు. ‘‘అప్పులు తీర్చడానికి నీకు డబ్బు కావాలి. నీ మామ చనిపోతేనే నీ భార్యకు ఆస్తి వస్తుంది. అందువల్ల నువ్వే ఆయనని చంపేశావ్’’ అన్నాడు. ‘‘కిడ్నాప్ అయినప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు’’ అన్నాడు వినోద్. ‘‘నువ్వే చంపావ్. హతుని మెడపై వేలిముద్రలు లభించాయి’’ చీకట్లో బాణం వేశాడు విజయ్. ‘‘ఎలా లభిస్తాయ్? నేనప్పుడు గ్లౌజులు ధరించాను..’’ గబుక్కున అనేసి నాలుక కరుచుకున్నాడు వినోద్. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని నేరం ఒప్పుకున్నాడు. హత్య ఎలా చేశాడో వివరించాడు – ‘‘నా ఫోన్లో మొబైల్ నంబర్ లొకేటర్ యాప్ ఉంది. దాంతో మావయ్య కిడ్నాప్ అయ్యాడని తెలిశాక ఆయన ఉన్న చోటుకి చేరుకున్నా. స్పృహలో లేని మావయ్యను చూశాక నాకు దుర్బుద్ధి పుట్టింది. ఆయనను చంపేస్తే ఆ నేరం కిడ్నాపర్‌పై పడుతుందనుకున్నాను. వెంటనే నా కారులో ఉన్న గ్లౌజులు ధరించి ఆయన్ని గొంతు పిసికి చంపేశాను. తర్వాత ఏమీ ఎరగనట్టు రఘు ఇంటికి వెళ్లిపోయాను’’ అన్నాడు వినోద్.
- మహబూబ్ బాషా