నిందితుల అరెస్టు
బి.కొత్తకోట: హార్సిలీహిల్స్‌కు వచ్చిన ఓ యువతి, యువకుడి ఫొటోలు తీసి బెదిరించిన కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం ఉదయం మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌లో అరెస్టు చేసినట్టు స్థానిక స్టేషన్‌హౌస్ ఆఫీసర్ మహాదేవ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈనెల 18న సోమల మండలానికి చెందిన కార్తీక్‌కుమార్ హార్సిలీహిల్స్‌కు వచ్చాడు. అదే సమయంలో మండలానికి చెందిన ఓ యువతి అక్కడకు రావడంతో ఒకరికొకరు మాట్లాడుకుంటూ గాలిబండ వద్ద కూర్చొన్నారు.
వీరిని గమనించిన అటవీశాఖ అతిథిగృహ వాచర్ మనోహర్, అటవీ బీట్ ఆఫీసర్ కుమారుడు సుధాకర్, ఓ హోంగార్డు తమ్ముడు రియాజ్‌లు సెల్ఫోన్లో వారిద్దరి ఫొటోలు తీశారు. ఫొటోలను మీ కుటుంబీకులకు పంపుతామని బెదిరించి, వారి వద్దనున్న రూ.5 వేల నగదును లాక్కొన్నారు. ఇదీ చాలదని మరో రూ.5 వేలను డిమాండ్ చేశారు. మరుసటి రోజు చెల్లిస్తామని చెప్పడంతో వారి చిరునామాలు రాసుకొని వదిలేశారు.
అక్కడి నుంచి వచ్చేసిన కార్తీక్‌కుమార్ మరుసటి రోజు 19వ తేదీ రూ.5 వేలు చెల్లించకపోవడంతో 20వ తేదీ నిందితులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వస్తే ఇస్తానని కార్తీక్‌కుమార్ చెప్పగా ఎన్టీఆర్ సర్కిల్‌కు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. ఈ విషయంలో నిందితులకు అనుమానం కలగడంతో ఎన్టీఆర్ సర్కిల్‌కు రాలేదు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం నిందితులు ముగ్గురినీ మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌లో అరెస్టు చేశామని చెప్పారు. వీరిని మదనపల్లె కోర్టుకు తరలించామని చెప్పారు. కాగా నిందితులు తమకు ఇలా చేయడం అలవాటని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఈ సంఘటనతో హార్సిలీహిల్స్‌లో కలకలం రేగింది. పర్యాటకులు స్వేచ్ఛగా కొండకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పర్యాట కులు కోరుతున్నారు.