ప్రతిపక్షం.. ప్రతిక్షణం ప్రజాపక్షం
కదిరి: ‘ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై అనుక్షణం అలుపెరుగని పోరాటం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతుం ది’ అని ఆ పార్టీ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను తక్షణం అమ లు చేయాలంటూ వైఎస్సార్సీపీ కలెక్టరేట్ ఎదుట డిసెంబర్ 5న తలపెట్టిన మహాధర్నా పోస్టర్లను ఎమ్మెల్యే ఆ పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ సిద్దారెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఆదివారం అత్తార్ రెసిడెన్సీలో విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు పంటరుణాలేవో, వ్యవసాయరుణాలేవో తెలియకపోతే ఎలా? అని ఆయన తప్పుబట్టారు. బాబు తన పాదయాత్రలో రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని రోజుకో మాట..పూటకో అబద్ధం చెబితే ఎలా? అని మండిపడ్డారు.
రైతులు బ్యాకుల నుంచి తీసుకున్న స్వల్ప, దీర్ఘకాలిక, ప్రాసెసింగ్ యూనిట్ తాలూకు రుణాలన్నీ వ్యవసాయ రుణాలకిందే వస్తాయన్నారు. ఆధార్‌ను ఆధారంగా చేసుకొని నిజమైన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కుటుంబానికే సాధ్యమన్నారు. తొలి సంతకం అంటే ఏమిటో మహానేత వైఎస్‌ను చూసి నేర్చుకో అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఎడ్ పూర్తి చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు వస్తాయని తప్పించుకోవడం వారిని మోసం చేయడమేనన్నారు. ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎవరికిచ్చారని ఆయన ప్రశ్నించారు.
బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తమ పార్టీ డిసెంబర్ 5న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగ యువత, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల సత్తా ప్రభుత్వానికి తెలియజేద్దామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ లోకేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్‌బాషా, కిన్నెర కళ్యాణ్, శివశంకర్‌నాయక్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షౌకత్, జైనుల్లా, కొమ్మెద్ది అప్పల్ల, బీసీ నాయకులు క్రిష్ణమూర్తి, నాగమల్లు,ఆంజనేయులు, లక్ష్మీపతిలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.