ఏటికొప్పాక మద్దతు ధర రూ.2384
ఎస్.రాయవరం : ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లుకు రానున్న సీజన్‌కు టన్ను చెరకు ధర రూ. 2384.64లుగా యాజమాన్యం ప్రకటించింది. ఫ్యా క్టరీ ప్రాంగణంలో సోమవారం 82వ మహాజన సభ నిర్వహించారు. గతేడాది, రానున్న సీజన్లకు సంబంధించి క్రషింగ్, రికవరీ, లావాదేవీల నివేదికలను ఎమ్డీ కెఆర్ విక్టర్‌రాజు చదివి వినిపించారు. అనంతరం సభలో చైర్మర్ రాజాసాగి రాంభద్రరాజు మాట్లాడుతూ రానున్న సీజన్లో 2 లక్షల టన్నులు క్రషింగ్‌కు అవకాశం ఉందన్నారు.
కాగా కొందరు రైతులు సభావేదిక వద్దకు దూసుకొచ్చి పంచదార బస్తాలు చోరీకి గురవుతంటే యాజమాన్యం ఏం చేస్తున్నదని నిలదీశారు. చోరీకి పాల్పడిన వారిపై కేసు ఎందుకు పెట్టలేదని దుయ్యబట్టారు. టన్ను చెరకుకు మద్దతు ధర రూ.3200లు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొందరు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపైకి వచ్చి వివరించారు.
ఏటా సర్వసభ్య సమావేశాలప్పుడు ప్రకటిస్తున్న హామీలు ఏవీ నెరవేర్చడం లేదని వాపోయారు. దీంతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. చివరిగా గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతలకు ప్రోత్సాహాక భహుమతులు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు.