టన్ను చెరకు రూ.2,215లు
యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఏటికొప్పాక సుగర్ ఫాక్టరీ పరిధిలో రైతులకు వచ్చే క్రషింగ్ సీజన్లో టన్నుకు రూ.2,215లు మద్దతు ధర చెల్లించడానికి శుక్రవారం జరిగిన మహాజనసభలో తీర్మానించారు. బ్యాంకులద్వారా సభ్య రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.200లు ప్రోత్సాహకానికి కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించగా రూ.120లు చెల్లింపునకు అంగీకరించారని చైర్మన్ రాజాసాగి రామభద్రరాజు సమావేశంలో వెల్లడించారు. వచ్చే సీజన్లో 2.25లక్షల టన్నుల క్రషింగ్ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
ఇటీవల కేంద్రప్రభుత్వం లెవీని తగ్గించడంవల్ల ఫ్యాక్టరీ పరిధిలో రైతులపై రూ.15లక్షల వరకు అదనపు భారం పడుతుందన్నారు. బేగాస్ కొరత వల్ల కో-జనరేషన్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగడంలేదని, రానున్న సీజన్లో దీనిని అధిగమిస్తామన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేస్తున్న సభ్యులుకాని రైతులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ఈ మేరకు సుగర్కేన్ కమిషనర్‌కు వివరాలు పంపామన్నారు.
ఫ్యాక్టరీ పరిధిలో 5,600ల మంది సభ్యులు ఉండగా ఇటీవల 930 మందిని తొలగించామని, 4700మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 1347 మంది వెల్ఫేర్ ఫండ్ చెల్లించడంలేదని వివరించారు. ఇక ముందు రైతులకు నాణ్యమైన ఎరువులను సరఫరాచేస్తామని, ఇకముందు పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు సోలార్ పంప్సెట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. యూనిట్ ఖరీదు రూ. 6లక్షలు కాగా, కేంద్రప్రభుత్వం 30శాతం,
రాష్ట్రప్రభుత్వం 20శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. యూనిట్ ఖరీదును మరింత తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రికవరీలో ఫ్యాక్టరీ వెనకబడుతోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వ రాయితీల గురించి వివరించడం లేదని వాపోయారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు ప్లాంటేషన్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాంటేషన్ వంటివాటితో అదనపు ఖర్చులు ఫ్యాక్టరీపై పడుతున్నాయని పలువురు రైతులనడంతో ఎమ్డీ విక్టర్‌రాజు మాట్లాడుతూ అటువంటిదేమీ లేదన్నారు. సమావేశంలో సభ్య రైతులకు రూ.రెండులక్షలవరకు బీమాకు తీర్మానించారు. 60 ఏళ్లు దాటిన సభ్యులకు బీమా వర్తించనందున నగదు చెల్లింపునకు నిర్ణయించారు. గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతులు సిద్దాబత్తుల వెంకటరమణ, దుబాసి తాతమ్మలతోపాటు 8మందికి ప్రోత్సాహకాలు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్డీ విక్టర్‌రాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు.