రాత్రికిరాత్రే దుకాణం లూటీ
జమ్మికుంట టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని మహాలక్ష్మీ జ్యువెల్లర్స్లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ దుకాణం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. బాధితుడు ముక్కా నారాయణ కథనం ప్రకారం... షాపును రోజూలాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో బంద్ చేశారు. ఉదయం షెట్టర్ పైకి లేపి ఉండడంతో పక్కనే ఉన్న దుకాణదారులు గుర్తించి యజమానికి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శిక్షణ డీఎస్పీ సుధీంద్ర, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్ నుంచి క్లూస్‌టీంను రప్పించారు. వారు ఆధారాలు సేకరించారు. షాపులో సీసీ కెమెరాలున్నా అవి సరిగా పని చేయకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. సుమారు రూ.8 ల క్షల రూపాయల విలువ చేసే 16 కిలోల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని, వెనకరూములో ఉన్న బంగారం లాకర్‌ను మాత్రం దొంగలు ముట్టుకోలేదని బాధితుడు పేర్కొన్నాడు. అయితే నాలుగు కిలోలు మాత్రమే పోయినట్లుగా కేసు నమోదైంది. దుకాణంలోని రశీదు పుస్తకం ఆధారంగానే కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.