mahammadabad
-
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
► నలుగురు ఆడపిల్లలు సంతానం ► భార్య మళ్లీ నిండు గర్భిణి ► ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ యజమాని బలవన్మరణం ► వీధినపడ్డ కుటుంబం ► మహమ్మదాబాద్‌లో విషాదం –––––––––––––––––––––– తలకొరివి పెట్టేవాడు కొడుకు మాత్రమేనని బలంగా నమ్మాడు. ఒకటి కాదు.. రెండు కాదు..వరుసగా నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్లలే పుట్టినా వంశోద్ధారకుడు కావాలన్న కోరిక అతనిలో తగ్గలేదు. భార్య ఐదోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అటు బతుకు భారం కాగా, ఈసారైనా కొడుకు పుడతాడో, లేదోనన్న బెంగతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అందరినీ అనాథలను చేసి అతను ఒంటరిగా వెళ్లిపోయాడు. ––––––––––––––––––––––––––––––––––––– అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన కమటం మహేశ్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి గుళికల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక గురకలు రావడాన్ని భార్య, కుటుంబ సభ్యులు గుర్తించారు. భయంతో వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి.. ముదిగుబ్బ పాతవీధికి చెందిన మీనమ్మతో ఎనిమిదేళ్ల కిందట మహేశ్ వివాహమైంది. వారికి వరుసగా నలుగురు ఆడపిల్లలలు సంతానం. కొడుకు కావాలన్న కోరికతో మళ్లీ ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భిణి. మహేశ్ తండ్రి వారపు సంతలకు వెళ్లి కూరగాయలు అమ్మేవారు. కొడుకు ఆటో నడుపుతూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఆటో మరమ్మతులకు గురి కావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రికి పిల్చుకెళ్లి చూపించే స్థోమత కూడా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక చివరకు మహేశ్ తనువు చాలించాడు. రంగంలోకి పోలీసులు విషయం తెలిసిన వెంటనే అమడగూరు ఎస్ఐ రఫీ తమ సిబ్బందితో శుక్రవారం మహమ్మదాబాద్ చేరుకున్నారు. ఆత్మహత్యపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ––––––––––––––––––––––––––––– ఎంత పని చేశావయ్యా.. జీవితాంతం తోడూనీడగా ఉంటావనుకుంటినే. నలుగురు ఆడపిల్లలకు తండ్రయ్యావు. ఇప్పుడు నేను మళ్లీ గర్భవతిని. ఈ సమయంలో అండగా ఉంటావనుకుంటే మమ్మల్నందర్నీ అనాథలను చేసి ఎల్లిపోతివి కదయ్యా.. ఇక మేం ఎవరి కోసం బతకాలి? ఈ పిల్లలను ఎలా సాకాలి? ముసలోళ్లైన మీ అమ్మానాన్నను ఇక ఎవరు చూసుకుంటారు? నాపై ఇంత భారం మోపి వెళ్లిపోతే నేనెలా భరించగలననుకున్నావ్..అంటూ మహేశ్ మతదేహం వద్ద భార్య మీనమ్మ ప్రశ్నిస్తూ ఏడ్వడం అందరి హదయాలను బరువెక్కించింది. నాన్న ఎందుకు పలకడం లేదో, అందరూ ఏడుస్తున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో, అసలు నాన్నకేమైందో కూడా తెలియక అతని నలుగురు ఆడబిడ్డలు అమాయక చూపులతో దిక్కులు చూస్తుండడం కఠిన హదయాలను సైతం కరిగించింది. పిల్లలకు ఇక ఏమని సమాధానం చెప్పాలో తెలియక మీనమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. –––––––––––––––––––––––––––––––––– -
అర్ధరాత్రి మహమ్మదాబాద్‌లో ఉద్రిక్తత
గండేడ్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని మహమ్మబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన వారు పోలీసు జీపును ధ్వంసం చేశారు. పోలీసులు 19 మందిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్ఐ సోమనర్సయ్య కథనం ప్రకారం.. మహమ్మబాద్కు చెందిన కేశవులు తన మరదల్ని తీసుకొని మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వెంకట్‌రెడ్డిపల్లి ఈదమ్మ జాతరకు వెళ్లాడు. జాతరకు వచ్చిన అదే గ్రామానికి చెందిన యువకులు చందు, బాల్‌రాజ్, నవీన్, ఆంజనేయులు కేశవులు మరదల్ని హేలన చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా అడ్డుకున్న కేశవులుపై దాడి చేశారు. అనంతరం కేశవులు గ్రామానికి వచ్చి తన సామాజిక వర్గానికి చెందిన వారితో విషయం చెప్పాడు. శాంతియుతంగా మాట్లాడుకుందామని రాత్రి 8 గంటల సమయంలో ఇరవర్గాలకు చెందిన కృష్ణ, కేశవులు తమ బైకులపై రాములు, నరేష్, వెంకటేష్, రమేష్‌లను ఎక్కించుకొని బీరప్పగుడి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ విందులో ఉన్న యువకులు తమ కాలనీకి ఎందుకు వచ్చారు..? అంటూ ఓ వర్గానికి చెందిన రాములు, నరేష్, వెంకటేష్, రమేష్‌పై దాడికి యత్నించారు. మిగతా వారు పరారవగా వెంకటేష్ వారికి చిక్కిపోవడంతో అక్కడే నిర్భందించి దాడి చేశారు. తప్పించుకున్న నరేష్ ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాలనీవాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలు, యువకులు పోలీసువాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. జీపు అద్దాలు పగిలిపోయాయి. ఘటనకు కారకులైన 10 మందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ మహమ్మబాద్ ఠాణాకు చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. యువతిని వేధించడం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం, దాడి పాల్పడడం ఘటనల కింద పోలీసులు తమ అదుపులో ఉన్న 10 మందితో పాటు మరో తొమ్మిది మందిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. గ్రామంలో 144 సెక్షన్.. మహమ్మబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ సోమనర్సయ్య తెలిపారు.