గండేడ్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని మహమ్మబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన వారు పోలీసు జీపును ధ్వంసం చేశారు. పోలీసులు 19 మందిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సోమనర్సయ్య కథనం ప్రకారం.. మహమ్మబాద్‌కు చెందిన కేశవులు తన మరదల్ని తీసుకొని మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వెంకట్‌రెడ్డిపల్లి ఈదమ్మ జాతరకు వెళ్లాడు. జాతరకు వచ్చిన అదే గ్రామానికి చెందిన యువకులు చందు, బాల్‌రాజ్, నవీన్, ఆంజనేయులు కేశవులు మరదల్ని హేలన చేశారు.
ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా అడ్డుకున్న కేశవులుపై దాడి చేశారు. అనంతరం కేశవులు గ్రామానికి వచ్చి తన సామాజిక వర్గానికి చెందిన వారితో విషయం చెప్పాడు. శాంతియుతంగా మాట్లాడుకుందామని రాత్రి 8 గంటల సమయంలో ఇరవర్గాలకు చెందిన కృష్ణ, కేశవులు తమ బైకులపై రాములు, నరేష్, వెంకటేష్, రమేష్‌లను ఎక్కించుకొని బీరప్పగుడి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ విందులో ఉన్న యువకులు తమ కాలనీకి ఎందుకు వచ్చారు..? అంటూ ఓ వర్గానికి చెందిన రాములు, నరేష్, వెంకటేష్, రమేష్‌పై దాడికి యత్నించారు.
మిగతా వారు పరారవగా వెంకటేష్ వారికి చిక్కిపోవడంతో అక్కడే నిర్భందించి దాడి చేశారు. తప్పించుకున్న నరేష్ ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాలనీవాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలు, యువకులు పోలీసువాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. జీపు అద్దాలు పగిలిపోయాయి. ఘటనకు కారకులైన 10 మందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ మహమ్మబాద్ ఠాణాకు చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. యువతిని వేధించడం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం, దాడి పాల్పడడం ఘటనల కింద పోలీసులు తమ అదుపులో ఉన్న 10 మందితో పాటు మరో తొమ్మిది మందిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు.
గ్రామంలో 144 సెక్షన్..
మహమ్మబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ సోమనర్సయ్య తెలిపారు.
అర్ధరాత్రి మహమ్మదాబాద్‌లో ఉద్రిక్తత
Published Thu, Feb 13 2014 12:14 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement