ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
► నలుగురు ఆడపిల్లలు సంతానం
► భార్య మళ్లీ నిండు గర్భిణి
► ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ యజమాని బలవన్మరణం
► వీధినపడ్డ కుటుంబం
► మహమ్మదాబాద్‌లో విషాదం
––––––––––––––––––––––
తలకొరివి పెట్టేవాడు కొడుకు మాత్రమేనని బలంగా నమ్మాడు. ఒకటి కాదు.. రెండు కాదు..వరుసగా నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్లలే పుట్టినా వంశోద్ధారకుడు కావాలన్న కోరిక అతనిలో తగ్గలేదు. భార్య ఐదోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అటు బతుకు భారం కాగా, ఈసారైనా కొడుకు పుడతాడో, లేదోనన్న బెంగతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అందరినీ అనాథలను చేసి అతను ఒంటరిగా వెళ్లిపోయాడు.
–––––––––––––––––––––––––––––––––––––
అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన కమటం మహేశ్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి గుళికల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక గురకలు రావడాన్ని భార్య, కుటుంబ సభ్యులు గుర్తించారు. భయంతో వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి..
ముదిగుబ్బ పాతవీధికి చెందిన మీనమ్మతో ఎనిమిదేళ్ల కిందట మహేశ్ వివాహమైంది. వారికి వరుసగా నలుగురు ఆడపిల్లలలు సంతానం. కొడుకు కావాలన్న కోరికతో మళ్లీ ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భిణి. మహేశ్ తండ్రి వారపు సంతలకు వెళ్లి కూరగాయలు అమ్మేవారు. కొడుకు ఆటో నడుపుతూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఆటో మరమ్మతులకు గురి కావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రికి పిల్చుకెళ్లి చూపించే స్థోమత కూడా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక చివరకు మహేశ్ తనువు చాలించాడు.
రంగంలోకి పోలీసులు
విషయం తెలిసిన వెంటనే అమడగూరు ఎస్‌ఐ రఫీ తమ సిబ్బందితో శుక్రవారం మహమ్మదాబాద్ చేరుకున్నారు. ఆత్మహత్యపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
–––––––––––––––––––––––––––––
ఎంత పని చేశావయ్యా..
జీవితాంతం తోడూనీడగా ఉంటావనుకుంటినే. నలుగురు ఆడపిల్లలకు తండ్రయ్యావు. ఇప్పుడు నేను మళ్లీ గర్భవతిని. ఈ సమయంలో అండగా ఉంటావనుకుంటే మమ్మల్నందర్నీ అనాథలను చేసి ఎల్లిపోతివి కదయ్యా.. ఇక మేం ఎవరి కోసం బతకాలి? ఈ పిల్లలను ఎలా సాకాలి? ముసలోళ్లైన మీ అమ్మానాన్నను ఇక ఎవరు చూసుకుంటారు? నాపై ఇంత భారం మోపి వెళ్లిపోతే నేనెలా భరించగలననుకున్నావ్..అంటూ మహేశ్ మతదేహం వద్ద భార్య మీనమ్మ ప్రశ్నిస్తూ ఏడ్వడం అందరి హదయాలను బరువెక్కించింది. నాన్న ఎందుకు పలకడం లేదో, అందరూ ఏడుస్తున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో, అసలు నాన్నకేమైందో కూడా తెలియక అతని నలుగురు ఆడబిడ్డలు అమాయక చూపులతో దిక్కులు చూస్తుండడం కఠిన హదయాలను సైతం కరిగించింది. పిల్లలకు ఇక ఏమని సమాధానం చెప్పాలో తెలియక మీనమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది.
––––––––––––––––––––––––––––––––––