మహానగరి ఎక్స్ ప్రెస్ లో బాంబు
మాణిక్ పూర్: వారణాసి-ముంబై మహానగరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెనుముప్పు తప్పింది. స్లీపర్ క్లాస్ లో అమర్చిన నాటు బాంబును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. రైలు గురువారం ఉత్తరప్రదేశ్ లోని మాణిక్ పూర్ కు చేరుకోగానే ఎస్ 3 కోచ్ లోని మరుగుదొడ్డి బయట బాంబును గుర్తించారు.
వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ దాన్ని బయటకు తీసింది. బాంబు విషయం తెలియగానే ప్రయాణికులు భయాందోళన చెందారు. ఉగ్రవాదులు ఎవరైనా బాంబు పెట్టారా అనే కోణంలో ముందుగా దర్యాప్తు చేపట్టారు. అయితే భయాందోళన రేపేందుకే బాంబు పెట్టినట్టు తర్వాత గుర్తించారు.