మహిమల తల్లి ‘మహాంకాళి
► నేటి నుంచి వాయిపేట మహాంకాళి జాతర
► వేలాదిగా తరలిరానున్న భక్తులు
► నాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర
ఆదిలాబాద్ కల్చరల్ : ఇంద్రవెల్లి మండలంలోని వాయిపేట గ్రామంలో మహాంకాళి, కాహంకాళి దేవతలు కోలువై ఉన్నారు. ఈ దేవతల దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. ఈ జాతరలో ఒక్కో రోజు 5 క్వింటాళ్లకు పైగా వంటకాలు చేసి మహా భోజనాన్ని నిర్వహిస్తారు. కొర్కెలు తీర్చే అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఆరోగ్య చికిత్స కోసం ఆయుర్వేదిక్ మందులను కూడా కినక శంభు మహారాజ్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కష్టాల్లో ఉన్నవారిని అమ్మవారు ఆదుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మహిమల మహాంకాళి..
మారు మూల అటవీ ప్రాంతంలో వాయిపేట గ్రామం ఉంది. రోడ్డు సౌకర్యాలు కూడా లేని ప్రాంతం వాయిపేట కానీ మహాంకాళి తల్లిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మహాంకాళి కాహాంకాళి అక్క చెల్లెళ్లు ఊయల్లో ప్రతిష్టించబడ్డారు. వీరు నిత్యం ఊయలలోనే పూజలందుకుంటారు. ఈ ఆలయాన్ని 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ స్థాపించారు.
10 ఏళ్లపాటు వెలుగు చూడని వైనం..
ఆదిలాబాద్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలోని.. ఇచ్చోడ నుంచి 30 కిలోమీటర్లు ఇంద్రవెల్లి ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ వాయిపేట మహాంకాళి మాత ఆలయం ఉంది. ఈ మందిరాన్ని గత 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ తన సొంత భూమిలో ఆలయాన్ని నిర్మిచారు. తనకు స్వప్నంలో (మహాంకాళి) మాత కనిపించి ఆలయం నిర్మించమని కోరినట్లు.. దీంతో చిన్న గుడిసెలో మహాంకాళి మాతను ఊయలలో ప్రతిష్టించినట్లు కినక శంభు మహారాజ్ పేర్కొన్నారు. ఈ మహాంకాళి తల్లిని ప్రతిష్టించిన మహారాజ్ కినక శంభు సోంతగా 15 ఏళ్లపాటు పూజలు చేస్త్తున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తుండడంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
సాంస్కృతిక పోటీలు...
వాయిపేట మహాంకాళి జాతరను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు విజేతలకు ప్రథమ బహుమతి రూ. 4101, ద్వితీయ బహుమతి రూ. 2101, తృతీయ రూ. 1101 బహుమతి అందించనున్నట్లు వారు పేర్కొన్నారు. 22వ తేదీ సాయంత్రం కంసూర్నాటకం ఉంటుందని పేర్కొన్నారు. అదే త రహాలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భక్తులకు ఏర్పాట్లు చేశాం..
ప్రతి ఏడాది మహాంకాళి తల్లి జాతరను నిర్వహిస్తున్నాం. భ క్తులు వేలాది సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత నాలుగైదేళ్లుగా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాల నుంచి మహరాష్ట్ర ప్రాం తాల నుంచి వచ్చి మొక్కులు తీర్చికుని పోతారు. ఆయుర్వేదిక్ మందులు చెట్ల మందులను భక్తుల కొన్ని రోగాలు నయం కావడానికి అందిస్తుంటాం. నమ్మకంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. భక్తుల నుంచి ఏమి ఆశించము. వారే అమ్మవారిని నమ్ముకుని మొక్కు తీరితే నోములు, వస్తువు కట్నకానుకలు సమర్పిస్తారు. - కినక శంభు మహరాజ్, మహాంకాళి ఆలయ వ్యవస్థాపకుడు
గ్రామస్తులమంతా ఏర్పాట్లు చేస్తున్నాం
మా గ్రామమే కాకుండా ఇతరాత్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. మా గ్రామస్తులమంతా జాతరను ఘనంగా నిర్వహిస్తాం. భక్తుల కోసం జాతర సమయంలో రోజుకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల అన్నదానం చేస్తాం. గ్రామస్తులు సర్పంచ్ల సహకారంతో నీటి సౌకర్యం కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. కొందరు భక్తులు అన్నదానం చేస్తారు. కానుకలు సమర్పిస్తారు. మొక్కులు తీర్చే తల్లి. అటవీ ప్రాంతంలో ఉండటంతో అభివృద్ధికి నోచుకోలేదు.
- రాము, భక్తుడు, వాయిపేట