ముస్తాబైన మహంకాళిగూడెం పుష్కరఘాట్
నేరేడుచర్ల : ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని మహంకాళిగూడెం పుష్కరఘాట్ ముస్తాబైంది. గతంలో ఉన్న ఘాట్ పక్కన నూతనంగా మరో ఘాట్ పనులు పూర్తికావడంతో నదికి అడ్డంగా రెయిలింగ్ ఏర్పాటుచేసి, ఘాట్లకు రంగులు వేయడంతో పుష్కర శోభను సంతరించుకుంది. మహంకాళిగూడెం పుష్కర ఘాట్ సమీపంలో బారీకేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా నదిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున నల్లాలను ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు మహంకాళిగూడెం సమీపంలో పార్కింగ్ స్థలాన్ని చదును చేసి రోడ్లు వేశారు. బైపాస్ రోడ్డు ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరువైపులా బైపాస్ రోడ్డును కొంతమేర బీటీ మెటల్‌తో వేశారు. నేరేడుచర్ల నుంచి మహంకాళీగూడెం వరకు 25 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసి రోడ్డుపై మార్కింగ్ చేయడం పూర్తి చేశారు. ఘాట్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం, మహంకాళి ఆలయంలో భక్తుల దర్శనార్ధం ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరంతర విద్యుత్ కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితులను గమనించేందుకు 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు పుష్కర స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.