కోలుకోలేని దెబ్బ
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇటీవల వారం రోజుల పాటు కురిసిన వర్షాలు పాలమూరు జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశువులు, పాకలు, బోరుమోటార్లు వరదలో కొట్టుకుపోయాయి. కాగా, తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా లెక్కలను జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద తయారుచేసింది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో భారీనష్టం జరిగింది. వర్షాలకు సంభవించిన నష్టాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది.
అధికారికంగా సమాచారం రాకపోయినా ముఖ్యమంత్రి పర్యటన ఉండొచ్చనే సంకేతాలు జిల్లా అధికారులకు రావడంతో కలెక్టర్ గిరిజాశంకర్ ఏర్పాట్లు పరిశీలించేందుకు సోమవారం అచ్చంపేటకు వెళ్లారు. ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్ననాటినుంచి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పర్యటిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అటు అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
నష్టం లెక్కలు తేల్చిన అధికారులు
ఇదిలాఉండగా వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు * 579.97కోట్ల నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కలు తేల్చారు. 54 మండలాల్లోని 853 గ్రామాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్లు భవనాలశాఖకు చెందిన సుమారు 60 కి.మీ మేర రోడ్లు, మూడు బ్రిడ్జిలు దెబ్బతినడంతో *51.62 కోట్ల నష్టం జరిగిందని గుర్తించారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌శాఖకు చెందిన 658 కి.మీ మేర దాదాపు 170 రోడ్లు పాడైపోవడంతో *316.75 కోట్లు, మునిసిపాలిటీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తెగిపోవడం వల్ల మరో *3.20కోట్ల నష్టం సంభవించినట్లు తేల్చారు. వీటితో పాటు ఆర్డబ్ల్యూఎస్ పథకాలు, ఏపీసీపీడీసీఎల్లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు విరిగిపోవడం వల్ల రూ.1.58 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌శాఖకు చెందిన *34.91 కోట్ల విలువ చేసే 551 పనులు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
68వేల ఎకరాల్లో పంటనష్టం
అంతేకాకుండా 66,330 ఎకరాల్లో పత్తి, వరి పంటలు పూర్తిగా నేలకొరగడంతో రైతులకు *150.75 కోట్ల నష్టం జరిగింది. అలాగే మరో 1700 ఎక రాల్లో టమాట, ఉల్లి, మిరప, బొప్పాయి తదితర పంటలకు *3.73 కోట్లు నష్టపోయారు. అలాగే 165 గొర్రెలు, ఎద్దులు మృతిచెందడంతో మరో *39 లక్షలు, జిల్లావ్యాప్తంగా 6771 ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడంతో దాదాపు *17.64 కోట్ల నష్టం సంభవించింది. వరదల కారణంగా జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.