mahashiva rathri bramhostavs
-
దేవదేవుని వైభవం
భూత, శుక వాహనాలపై శివపార్వతుల అభయం కన్నుల పండువగా వాహనసేవలు తరించిన భక్తజనం శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: భక్తవత్సలుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భూతనాథు డై భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం భూతరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి వారు ఉదయం సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు భూత వాహనంపై, అమ్మవారు శుక (చిలుక) వాహనంపై దర్శనమిచ్చారు. తొలుత శ్రీకాళహస్తి పట్టణంలోని దేవాంగ సత్రం వద్దకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. భూతరాత్రి సందర్భంగా ఉదయం గంగాదేవి సమేతుడైన సోమస్కంధమూర్తిని సూర్యప్రభ వాహనంపై, జ్ఞానప్రసూనాంబను చప్పరం వాహనంపై నిలిపి పురవీధుల్లో ఊరేగించారు. సూర్యుభగవానుడు తన తేజోమయమైన కిరణాలను కోటిసూర్యప్రకాశుడైన స్వామివారి పాదాలను స్పృశిస్తుండగా స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. రాత్రి పరమేశ్వరుడు భూతగణాలపై తనకున్న అభిమానాన్ని చాటుతూ భూతవాహనంపై ఆశీనుడై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ శుక (చిలుక) వాహనాన్ని అధిరోహించి కోరిన కోర్కెలు తీర్చే దేవతగా సాక్షాత్కరించారు. ముందుగా వినాయకుడు, శ్రీవళ్లీ దేవసేన సమేతుడైన సుబ్రమణ్యస్వామి, భక్తకన్నప్ప వెళ్లారు. వెనుక స్వామివారు భూత వాహనంపై, ఆయన పక్కనే అపురూప లావణ్యవతిగా పట్టువస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలను అలంకరించుకున్న జగన్మాత చిలుక వాహనాన్ని అధిరోహించి ముందుకు సాగారు. వేదపండితుల మంత్రాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజనలతో ఊరేగింపు వైభవంగా సాగింది. ఊరేగింపులో ఉత్సవమూర్తుల పట్టువస్త్రాలు, కళ్లుచెదిరే స్వర్ణాభరణాలు, ప్రత్యేక పుష్పాలంకరణ భక్తులను కట్టిపడేసింది. ఈ వేడుకలో ఉభయదారులు శ్రీకాళహస్తి హరిజన సేవా సంఘం సభ్యులు పసల రమణయ్య, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, అధికారులు నాగభూషణం, హరిబాబు, వెంకటేశ్వర్రాజు, నాగయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నేడు గంధర్వ రాత్రి మంగళవారం గంధర్వరాత్రి జరగనుంది. గాంధర్వులు శివుని మేల్కొల్పేందుకు చేసే పూజలనే గాంధర్వరాత్రి అంటారు. స్వామి, అమ్మవారు ఉదయం హంస, యాళి వాహనాలపై, రాత్రి రావణ, మయూర వాహనాలపై ఊరేగనున్నారు. -
నేటి నుంచి కీసర బ్రహ్మోత్సవాలు
పూర్తయిన ఏర్పాట్లు వచ్చేనెల 2వ తేదీ వరకు జాతర కీసర, న్యూస్‌లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్ట దేవాలయంలో మంగళవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం 11గంటలకు ఆలయ చైర్మన్ తటాకం రమేష్‌శర్మ దంపతులచే విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విక్పరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్ఠాపనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతిరాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, రాత్రి 8 గంటలకు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారి ఊరేగింపు ఉంటాయి. పకడ్బందీ ఏర్పాట్లు.. కీసరగుట్ట జాతరకు ఆరులక్షలమంది యాత్రికులు వస్తారని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. జాయింట్ కలెక్టర్ చంపాలాల్ ఆధ్వర్యంలో జాతర కోఆర్డినేషన్ కమిటీ సోమవారం సాయంత్రం మరోసారి జాతర ఏర్పాట్లను సమీక్షించింది. మహాశివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీవీఐపీ పాస్‌లు లేవు.. ఈ ఏడాది జాతరలో వీవీఐపీ పాస్‌ల విధానాన్ని ఉపసంహరించారు. ఈ పాస్‌ల జారీపై ఆలయ చైర్మన్, జిల్లా అధికారులు ఎన్నోసార్లు చర్చించి చివరికి పాస్‌లు ఇవ్వరాదని నిర్ణయించారు. దర్శనానికి వచ్చే ముఖ్యులను రిసెప్షన్ కమిటీ ద్వారా వీవీఐపీ ప్రత్యేక గేటు ద్వారా పంపనున్నారు. రూ.250, రూ.100 ప్రత్యేక దర్శనాలతో పాటు అభిషేక భక్తులకు అదనంగా మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. భక్తులకు లోటు రాకుండా చర్యలు .. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి దర్శనం కోసం కీసరగుట్టకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆలయ చైర్మన్ తటాకం రమేష్‌శర్మ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా ప్రధానంగా దృష్టి సారించామన్నారు.