
దేవదేవుని వైభవం
భూత, శుక వాహనాలపై శివపార్వతుల అభయం
కన్నుల పండువగా వాహనసేవలు
తరించిన భక్తజనం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: భక్తవత్సలుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భూతనాథు డై భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం భూతరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి వారు ఉదయం సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు భూత వాహనంపై, అమ్మవారు శుక (చిలుక) వాహనంపై దర్శనమిచ్చారు. తొలుత శ్రీకాళహస్తి పట్టణంలోని దేవాంగ సత్రం వద్దకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. భూతరాత్రి సందర్భంగా ఉదయం గంగాదేవి సమేతుడైన సోమస్కంధమూర్తిని సూర్యప్రభ వాహనంపై, జ్ఞానప్రసూనాంబను చప్పరం వాహనంపై నిలిపి పురవీధుల్లో ఊరేగించారు. సూర్యుభగవానుడు తన తేజోమయమైన కిరణాలను కోటిసూర్యప్రకాశుడైన స్వామివారి పాదాలను స్పృశిస్తుండగా స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు.
రాత్రి పరమేశ్వరుడు భూతగణాలపై తనకున్న అభిమానాన్ని చాటుతూ భూతవాహనంపై ఆశీనుడై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ శుక (చిలుక) వాహనాన్ని అధిరోహించి కోరిన కోర్కెలు తీర్చే దేవతగా సాక్షాత్కరించారు. ముందుగా వినాయకుడు, శ్రీవళ్లీ దేవసేన సమేతుడైన సుబ్రమణ్యస్వామి, భక్తకన్నప్ప వెళ్లారు. వెనుక స్వామివారు భూత వాహనంపై, ఆయన పక్కనే అపురూప లావణ్యవతిగా పట్టువస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలను అలంకరించుకున్న జగన్మాత చిలుక వాహనాన్ని అధిరోహించి ముందుకు సాగారు. వేదపండితుల మంత్రాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజనలతో ఊరేగింపు వైభవంగా సాగింది. ఊరేగింపులో ఉత్సవమూర్తుల పట్టువస్త్రాలు, కళ్లుచెదిరే స్వర్ణాభరణాలు, ప్రత్యేక పుష్పాలంకరణ భక్తులను కట్టిపడేసింది. ఈ వేడుకలో ఉభయదారులు శ్రీకాళహస్తి హరిజన సేవా సంఘం సభ్యులు పసల రమణయ్య, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, అధికారులు నాగభూషణం, హరిబాబు, వెంకటేశ్వర్‌రాజు, నాగయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు గంధర్వ రాత్రి
మంగళవారం గంధర్వరాత్రి జరగనుంది. గాంధర్వులు శివుని మేల్కొల్పేందుకు చేసే పూజలనే గాంధర్వరాత్రి అంటారు. స్వామి, అమ్మవారు ఉదయం హంస, యాళి వాహనాలపై, రాత్రి రావణ, మయూర వాహనాలపై ఊరేగనున్నారు.