మంచి అణువంతైనా పుణ్యం అనంతం
-ఇదే ‘పాండురంగ మాహాత్మ్యం’ సారాంశం
–భువన విజయ ప్రసంగాల్లో కార్తికేయశర్మ
రాజమహేంద్రవరం కల్చరల్ : మంచి అన్నది స్వల్పంగా చేసినా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందన్నదే తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యం’ సందేశమని ప్రముఖ సాహితీవేత్త కర్రా కార్తికేయశర్మ అన్నారు. ఆయన గడసరి పోకడల కవి అని కొనియాడా.నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరుగుతున్న భువన విజయ సాహితీప్రసంగ పరంపరలో భాగంగా గురువారం శర్మ ‘పాండురంగ మాహాత్మ్యం– రంగానుగ్రహం' అనే అంశంపై ప్రసంగించారు. శైవమతస్తుడయిన రామలింగడు రాయల కొలువులోకి వచ్చాక, వైష్ణవుడై 'రామకృష్ణుడు’ అయ్యాడని వివరించారు. తెనాలి అగ్రహారం స్వీకరించాక, తెనాలి ఇంటి పేరుగా వాడుకలోకి వచ్చిందన్నారు. పార్వతీదేవి తన పెంపుడు చిలుకకు విష్ణుసహస్ర నామాలు నేర్పినట్టు రామకృష్ణుడు తన ప్రబంధంలోని ఆరంభపద్యాలలో పేర్కొన్నాడన్నారు. ఇందులో అసమంజసం ఏమీ లేదని, స్త్రీకి పుట్టింటిమీద మమకారం సహజమని, పార్వతి 'పద్మనాభ సహోదరి', విష్ణువుకు చెల్లెలని చెప్పారు. ‘పాండురంగ మాహాత్మ్యం’లో అపమార్గం పట్టిన నిగమ శర్మను సంస్కరించడానికి ప్రయత్నించే అతడి సోదరిని అక్కగానే రామకృష్ణుడు వ్యవహరించారని, అగస్త్యుని సోదరుని అగస్త్యభ్రాతగానే ప్రాచీనకావ్యాలలో చెప్పారని అన్నారు. నిగమశర్మ ఎలా విష్ణు సాయుజ్యం పొందాడో కవి తనప్రబంధంలో వివరించారన్నారు. జోరాశర్మ (జోస్యుల రామచంద్ర శర్మ) అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా ముత్యా వెంకటేశ్వరరావు ప్రసంగించారు.రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతలపాటి శర్మ స్వాగతం పలకగా, దేవీసుదర్శన్ వందన సమర్పణ చేశారు.
నేడు మనుచరిత్రపై సందీప్ ప్రసంగం
భువన విజయసాహితీప్రసంగాలలో భాగంగా శుక్రవారం ‘మనుచరిత్ర–జీవన విధులు’ అనే అంశంపై తాతా రమా సత్యసందీప శర్మ ప్రసంగిస్తారు.