‘మహావీర్’ భూమి లీజుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మహావీర్ ఆస్పత్రి భూమి లీజుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి శనివారం గవర్నర్ వద్ద ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఏఎన్ రాయ్, సీనియర్ అధికారులు అజయ్ కల్లం, పీవీ రమేష్, ప్రదీప్ చంద్ర, శివ శంకర్, లక్ష్మీ పార్థసారధి, బీఆర్ మీనా తదితరులు హాజరయ్యారు.
మహావీర్ ఆస్పత్రికి ఇప్పుడున్న భూమిని మరో 30 ఏళ్ల పాటు లీజుకోసం అనుమతిని ఇచ్చారు. అయితే లీజు అద్దె విషయంలో తుది నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. అలాగే పుల్లెల గోపీచంద్ ఏర్పాటు చేసే బ్యాడ్మింటన్ అకాడమీకి భూ కేటాయింపునకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ విషయంలో పొందుపరిచే నిబంధనలపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటు నెల్లూరు జిల్లాలో 4.79 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 502.30 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించే విషయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలి పెట్టారు. కాగా రాజ్‌భవన్‌లో పనిచేయడానికి అదనపు సిబ్బంది, వారు ఉండడానికి వసతి, వాహనాలను సమకూర్చడానికి సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ ఆమోదించారు.