Mahesh Savani
-
ఒకేసారి 251 జంటలకు పెళ్లిళ్లు
సాక్షి, అహ్మదాబాద్: డబ్బు సంపాదనలోనే కాదు సమాజ సేవలోనూ ముందున్నారు గుజరాత్ నగరం సూరత్‌వాసి మహేశ్ సవానీ. ఏటా ఆయన వందలాది పేదలకు పెళ్లిళ్లు చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా 251 జంటలను ఒకటి చేశారు. కుబేరుల పెళ్లి వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో లక్ష మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి మరీ ఈ సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లి కానుకగా ఖరీదైన నగలు, బహుమతులు అందించారు. ఆయన వివాహం జరిపించిన వాటిలో ఐదు ముస్లిం జంటలు, ఒక క్రైస్తవ జంట ఉంది. హిందువులకు వైదిక సంప్రదాయం ప్రకారం.. మిగిలిన వారికి ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పటి వరకు సవానీ వెయ్యి జంటలకు వివాహం జరిపించారు. 2008లో తనదగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోయాడు. మరికొద్ది రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ సవానీ పెళ్లి పెద్దగా మారారు. అప్పటి నుంచి ప్రతిఏటా ఎంతోమంది అనాధ యువతులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపిస్తున్నారు. -
నాన్నకు ప్రేమతో... 472 మంది కూతుళ్లు!
అహ్మదాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా ఒక తండ్రికి 472 మంది కూతుళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంది కూతుర్లేంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ ఇది నిజం. కాకపోతే వాళ్లంతా తండ్రి లేని పిల్లలు. వాళ్లందరికీ ఆయనే తండ్రయ్యాడు. ఆయనే గుజరాత్ కు చెందిన మహేష్ సవాని. పదేళ్ల క్రితం తన తమ్ముడు చనిపోవడంతో అతడి కూతుర్లకు వివాహం చేయడంతో ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు తండ్రిలేని 472 మంది యువతులకు వివాహం జరిపించాడు. ఇందుకోసం ఒక్కొక్కరిపై ఆయన రూ. 4 లక్షలు ఖర్చు చేశాడు. భర్త చనిపోయిన స్త్రీ తన కూతురు పెండ్లి చేయడం చాలా కష్ట సాధ్యమని, అందుకే తానీ వివాహాలు చేస్తున్నానని సవాని తెలిపాడు. 2016 లో 216 మంది యువతులకు వివాహం చేసినట్టు ఆయన చెప్పాడు. తాను వివాహం జరిపించిన వారిలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని వెల్లడించాడు. ఇలాంటి అమ్మాయిలకు సహాయం చేయడానికి తానెప్పుడూ ముందుంటానని అన్నారు. -
'ఈ వజ్రాల వ్యాపారి.. మనిషీ వజ్రమే'
సూరత్: సూరత్‌లో ఆదివారం 151 జంటలు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి కుమార్తెల కోసం ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీరలు తెప్పించారు. మూడురోజుల పాటు జరిగిన వివాహ వేడుకకు దాదాపు లక్షమంది హాజరయ్యారు. వివాహ వేదికను అందంగా అలంకరించారు. రుచికరమైన వంటలు వండించారు. ఖర్చు 5 కోట్ల రూపాయలు. ఈ ఘనమైన ఏర్పాట్లను చూస్తే అందరూ ధనవంతుల పెళ్లిళ్లు అని అనుకుంటారు. అయితే పెళ్లి కుమార్తెలలో ఎవరికి తండ్రీ లేడు. వివాహం చేసుకోవడానికి ఆర్థిక స్థోమతలేనివారు. సూరత్ చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ శావని ఓ తండ్రిలా వచ్చి.. సొంతఖర్చుతో అంగరంగవైభవంగా పేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించారు. తమ ఇంట్లో శుభకార్యాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే కోటీశ్వరులు చాలా మంది ఉండొచ్చు కానీ ఇలాంటి దాతలు మాత్రం అరుదు. కొన్నేళ్లుగా మహేశ్ శావని తండ్రిలేని, నిరుపేద యువతులకు ఓ తండ్రిలా ఉచిత వివాహాలు జరిపిస్తున్నారు. 2008లో మహేశ్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి తన ఇద్దరు కుమార్తెల పెళ్లికి కొన్ని రోజుల మందు మరణించాడు. మహేశ్ తన ఉద్యోగి బాధ్యతలను భుజాన వేసుకుని తండ్రిగా ఆ ఇద్దరు అమ్మాయిలకు వివాహం జరిపించాడు. అప్పట్నుంచి ప్రతి ఏటా తండ్రి లేని నిరుపేద యువతులకు సొంత ఖర్చుతో ఘనంగా వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి వధువుకూ బంగారు నగలు, దుస్తులు, కలశం, ఓ పళ్లెం అందజేస్తారు. పెళ్లి రోజున తండ్రి అవసరం ఎంతన్నది తండ్రిలేనివారికే తెలుస్తుందని విమలా కోరింగా అనే వధువు చెప్పింది. మరో వధువు మీటల్ గోండాలియా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం మా నాన్న మరణించారు. నా పెళ్లికి డబ్బులు ఎలా సమకూర్చాలని అమ్మ ఆందోళన చెందేది. మహేశ్ శావని పప్పా దేవుడిలా వచ్చి ఆదుకున్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది.