
సాక్షి, అహ్మదాబాద్: డబ్బు సంపాదనలోనే కాదు సమాజ సేవలోనూ ముందున్నారు గుజరాత్ నగరం సూరత్‌వాసి మహేశ్ సవానీ. ఏటా ఆయన వందలాది పేదలకు పెళ్లిళ్లు చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా 251 జంటలను ఒకటి చేశారు. కుబేరుల పెళ్లి వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో లక్ష మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి మరీ ఈ సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లి కానుకగా ఖరీదైన నగలు, బహుమతులు అందించారు.
ఆయన వివాహం జరిపించిన వాటిలో ఐదు ముస్లిం జంటలు, ఒక క్రైస్తవ జంట ఉంది. హిందువులకు వైదిక సంప్రదాయం ప్రకారం.. మిగిలిన వారికి ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పటి వరకు సవానీ వెయ్యి జంటలకు వివాహం జరిపించారు. 2008లో తనదగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోయాడు. మరికొద్ది రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ సవానీ పెళ్లి పెద్దగా మారారు. అప్పటి నుంచి ప్రతిఏటా ఎంతోమంది అనాధ యువతులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపిస్తున్నారు.