marriage set
-
ఒకేసారి 251 జంటలకు పెళ్లిళ్లు
సాక్షి, అహ్మదాబాద్: డబ్బు సంపాదనలోనే కాదు సమాజ సేవలోనూ ముందున్నారు గుజరాత్ నగరం సూరత్‌వాసి మహేశ్ సవానీ. ఏటా ఆయన వందలాది పేదలకు పెళ్లిళ్లు చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా 251 జంటలను ఒకటి చేశారు. కుబేరుల పెళ్లి వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో లక్ష మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి మరీ ఈ సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లి కానుకగా ఖరీదైన నగలు, బహుమతులు అందించారు. ఆయన వివాహం జరిపించిన వాటిలో ఐదు ముస్లిం జంటలు, ఒక క్రైస్తవ జంట ఉంది. హిందువులకు వైదిక సంప్రదాయం ప్రకారం.. మిగిలిన వారికి ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పటి వరకు సవానీ వెయ్యి జంటలకు వివాహం జరిపించారు. 2008లో తనదగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోయాడు. మరికొద్ది రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ సవానీ పెళ్లి పెద్దగా మారారు. అప్పటి నుంచి ప్రతిఏటా ఎంతోమంది అనాధ యువతులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపిస్తున్నారు. -
ఉక్కుమహిళకు పెళ్లి కుదిరింది
ఇంఫాల్: ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే ఆ రాష్ట్ర ఉక్కు మహిళ, పోరాటయోధురాలు ఇరోం షర్మిల త్వరలో తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ ధ్రువీకరించారు. కాగా వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ జంట అక్కడే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు. షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో 2011లో ఆమెకు తొలిసారి బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకున్నారు. వివాహం బంధంతో తామిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు డెస్మండ్ చెప్పారు. అనుమతులు తీసుకున్నాక తమిళనాడులోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ధ్రువీకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేసిన దీక్షను షర్మిల విరమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఘోర పరాజయం ఎదురైంది. థౌబాల్ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేయగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.