సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం.
సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది.
15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది.
వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్‌లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్‌లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్‌లోని డైమండ్ బోర్స్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్‌లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్స్‌లో 4500 ఆఫీస్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment