Mahidharreddi
-
లైన్ క్లియర్
=మున్సిపాలిటీల ఫైలుపై మంత్రి మహీధర్ సంతకం =35 పంచాయతీలను డీనోటిఫై చేయాలని పీఆర్‌కు లేఖ =నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలో కొత్త మునిసిపాలిటీలు/నగర పంచాయతీలు రానున్నాయి. 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ప్రభుత్వం... వాటిని గ్రేటర్లో కలిపే అంశంలో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లి, కాల్వంచ గ్రామాలు మినహా.. మిగతావాటిని మున్సిపాలిటీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖలో విలీనం చేసుకుంటున్న గ్రామాలను డీనోటిఫై చేయాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖకు ఫైలు పంపారు. అక్కడి నుంచి ఫైలు ముఖ్యమంత్రి దరికి చేరనుంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి... శివారు పంచాయతీలు కాస్తా మున్సిపాలిటీలుగా/నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలివే: శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, కొంపల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, కొత్తపేట, జల్పల్లి, బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం -
జల మండలిపై భస్మాసుర ‘హస్తం’!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాల్సిన జలమండలి పరిపాలన వ్యవహారాలపై భస్మాసుర ‘హస్తం’ పడింది. జలమండలిలో కీలక పదవుల్లో ఉన్న జనరల్ మేనేజర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, డెరైక్టర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో నగరానికి చెందిన ఓ మంత్రి మితిమీరి జోక్యం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సదరు పాలనా వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని తాజాగా ఆయన హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఛాంబర్లో జరిగిన సమావేశంలోనూ వాటర్‌బోర్డులో తన అనుమతి లేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టారదంటూ బోర్డు ఉన్నతాధికారులను ఆయన బెదిరించినంత పని చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూకల్లోతు ఆర్థిక నష్టాలు, సరఫరా నష్టాలతో సతమతమవుతున్న బోర్డుకు ఈ పరిణామం అశనిపాతమౌతోంది. బోర్డు నిబంధనలు బేఖాతర్..! జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. అప్పుడే ఉద్యోగుల నియామకం, భర్తీ తదితర విషయాల్లో బోర్డు యాజమాన్యానికే విచక్షణాధికారాలు కట్టబెట్టారు. కానీ ఇపుడు ఆ నిబంధనలు సదరు మంత్రికి పట్టడం లేదు. ఎన్నికల తరుణంలో తమ పబ్బం గడుపుకునేందుకు, ఆయన కనుసన్నల్లో పనిచేసే వారికే కీలక పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల టెండర్లు ముగిసిన కృష్ణా మూడోదశ పథకంలోనూ సదరు అమాత్యుని జోక్యం సుస్పష్టమేనన్న వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వవర్గాలు, గుత్తేదారులకు మధ్య రాజీ కుదిర్చినందుకు ఆయనకు బాగానే గిట్టుబాటయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివుల చుట్టూ ప్రదక్షిణలు తాజాగా జలమండలిలో బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో సదరు మంత్రి చలవ ఉంటే చాలన్న ధోరణి పెరుగుతుండటం గమనార్హం. గ్రేటర్లో సక్రమంగా మంచినీటి పంపిణీ, సరఫరా నష్టాల తగ్గింపు, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, రెవెన్యూ పెంచడం వంటి అంశాలను పక్కనబెట్టి కొందరు ఉన్నతాధికారులు సదరు అమాత్యుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం బోర్డు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.జలమండలి పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం శ్రుతిమించుతుండటంతో బోర్డు ముందరికాళ్లకు బంధం పడుతోంది. అసమర్థ అధికారుల బదిలీ, సమర్థులకు పదోన్నతులు కల్పించే విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తుండటంతో ఉన్నతాధికారుల్లో అభద్రతాభావం పెరుగుతుందన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం. -
అక్రమాల సంగతేంటి?
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హెచ్ఎండీఏలో, దాని పరిధిలోని జోనల్ కార్యాలయాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నపనికీ అధికారులు స్వప్రయోజనం వెతుకుతుండటంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెడ్డ పేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సోమవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘జోనల్ కార్యాలయాల పై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులేం చేస్తున్నారు? సిబ్బందిపై నియంత్రణ లేదా? ఇలా ఎందుకు జరుగుతోంద’ని ప్రశ్నిం చారు. ‘సాక్షి’లో ‘మహా మాయ’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని తన ఫైల్ నుంచి బయటకు తీసి చూపుతూ అవినీతి అక్రమాలపై అధికారులను నిలదీశారు. ఆ వార్త ఈ రోజే ప్రచురితమైందని పీఆర్ఓ రామకృష్ణ చెప్పగా, దీనిపై ఉదయం నుంచి నీవేం చేశావ్? పై అధికారుల దృష్టికి తీసుకెళ్లావా? అంటూ ఎదురు ప్రశ్నవేశారు. సంస్థపై పత్రికల్లో వార్తలు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని, పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలని హితబోధ చేశారు. కనీసం వివరణ అయినా ఇవ్వండని సూచించారు. స్పందన లేకుండా ఉంటే ఎలా అంటూ పరోక్షంగా కమిషనర్ నీరభ్‌కుమార్‌కు చురక అంటించారు. ‘ఇమేజ్ పెంచుకోండి.. కష్టపడి పనిచేస్తే పేరొస్తుంది. రూల్స్ ప్రకారం పనులు చేయండి. లేదంటే తిరస్కరించండి. అంతేగాని నెలల తరబడి ప్రజలను తిప్పుకోవద్దు’ అంటూ అధికారులను హెచ్చరించారు. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఇక్కడ కొందరు సిబ్బందే కీలకమైన ఫైళ్లను తగులబెట్టడం వల్ల హెచ్ఎండీఏ ప్రతిష్ఠ దిగజారిందని, బాధితులకు న్యాయం చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ ఐకాన్.. ఔటర్ హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రజలు ఔటర్ రింగ్‌రోడ్డు గురించి చెబుతున్నారని, దానిని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను తిలకించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, నిర్దేశించిన లక్ష్యాలను పీడీ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఔటర్ మెయిన్ క్యారేజ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌కి పూర్తి చేస్తామని, అలాగే ఫైనల్ వర్క్‌ను 2014 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఓఆర్ఆర్ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. కమిషనర్ నీరభ్‌కుమార్ సంస్థ ఆర్థిక పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సిన బకాయీల విషయమై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఓ నిర్ణయం తీసుకొంటామని మంత్రి చెప్పారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన అభివృద్ధి నిధులను కూడా ఇప్పించేందుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. తీరు మార్చుకోండి.. విలువైన స్థలాలు కబ్జా అవుతోంటే వాటి నివారణ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ వారిపై తోసేస్తున్నారు. అటు వాళ్లు, ఇటు మీరు పట్టించుకోకపోతే ఆక్రమణలు మరింత పెరుగుతాయి. గ్రామ పంచాయతీల్లో ఇచ్చే పర్మిషన్లు కాదు... హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులే ఫైనల్ కావాలి. ఇందు కోసం ఒక విధానం కావాలి. కొంతమేరకు ప్లాన్లకు అనుమతినిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంటే అది కూడా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే చేసి ఫీజులో వారి వాటా వారికివ్వాలి. డెవలప్మెంట్ అథార్టీ అంటే నగరాభివృద్ధికి పాటుపడాల్సిన సంస్థ. జోనల్ కార్యాలయాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా కొత్త విధానాన్ని అభివృద్ధి చేయండి. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, బిల్డింగ్ ప్లాన్స్, లేఅవుట్స్ వంటివి ఆన్లైన్లో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై దృష్టిపెట్టి సత్ఫలితాలు సాధించండి. - మంత్రి మహీధర్‌రెడ్డి