జల మండలిపై భస్మాసుర ‘హస్తం’! | Water Council freedom 'hand'! | Sakshi
Sakshi News home page

జల మండలిపై భస్మాసుర ‘హస్తం’!

Published Tue, Jan 7 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

Water Council freedom 'hand'!

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాల్సిన జలమండలి పరిపాలన వ్యవహారాలపై భస్మాసుర ‘హస్తం’ పడింది. జలమండలిలో కీలక పదవుల్లో ఉన్న జనరల్ మేనేజర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, డెరైక్టర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో నగరానికి చెందిన ఓ మంత్రి మితిమీరి జోక్యం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సదరు పాలనా వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని తాజాగా ఆయన హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఛాంబర్‌లో జరిగిన సమావేశంలోనూ వాటర్‌బోర్డులో తన  అనుమతి లేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టారదంటూ బోర్డు ఉన్నతాధికారులను ఆయన బెదిరించినంత పని  చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూకల్లోతు ఆర్థిక నష్టాలు, సరఫరా నష్టాలతో సతమతమవుతున్న బోర్డుకు ఈ పరిణామం అశనిపాతమౌతోంది.
 
బోర్డు నిబంధనలు బేఖాతర్..!
 
జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. అప్పుడే ఉద్యోగుల నియామకం, భర్తీ తదితర విషయాల్లో బోర్డు యాజమాన్యానికే విచక్షణాధికారాలు కట్టబెట్టారు. కానీ ఇపుడు ఆ నిబంధనలు సదరు మంత్రికి పట్టడం లేదు. ఎన్నికల తరుణంలో తమ పబ్బం గడుపుకునేందుకు, ఆయన కనుసన్నల్లో పనిచేసే వారికే కీలక పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల టెండర్లు ముగిసిన కృష్ణా మూడోదశ పథకంలోనూ సదరు అమాత్యుని జోక్యం సుస్పష్టమేనన్న వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వవర్గాలు, గుత్తేదారులకు మధ్య రాజీ కుదిర్చినందుకు ఆయనకు బాగానే గిట్టుబాటయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
సచివుల చుట్టూ ప్రదక్షిణలు
 
తాజాగా జలమండలిలో బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో సదరు మంత్రి చలవ ఉంటే చాలన్న ధోరణి పెరుగుతుండటం గమనార్హం. గ్రేటర్‌లో సక్రమంగా మంచినీటి పంపిణీ, సరఫరా నష్టాల తగ్గింపు, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, రెవెన్యూ పెంచడం వంటి అంశాలను పక్కనబెట్టి కొందరు ఉన్నతాధికారులు సదరు అమాత్యుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం బోర్డు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.జలమండలి పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం శ్రుతిమించుతుండటంతో బోర్డు ముందరికాళ్లకు బంధం పడుతోంది. అసమర్థ అధికారుల బదిలీ, సమర్థులకు పదోన్నతులు కల్పించే విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తుండటంతో ఉన్నతాధికారుల్లో అభద్రతాభావం పెరుగుతుందన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement