సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రజలు తాగే నీటికి ఏటా కనీసం రెండు విడతల పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించడం.. కలుషితాలు గుర్తించినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటి సౌకర్యాల కల్పన–ప్రజల భాగస్వామ్యం తదితర కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది.
మొత్తం 700కు గాను తమిళనాడు 699.93 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, ఏపీ 657.10 మార్కులతో రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అట్టడుగు స్థానాల్లో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి.
ఏపీలో 99.7 శాతం గ్రామాల్లో..
ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోర్లు, బావులు, ఇతర వనరులలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 99.7 శాతం గ్రామాల్లోని నీటిలో బ్యాక్టీరియా, కెమికల్ సంబంధిత కలుషితాలను ప్రాథమికంగా గుర్తించడానికి కిట్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి నిర్వహణపైనా గ్రామంలో ఒకరికి శిక్షణ ఇచ్చినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలోని 18,357 గ్రామాలకు గాను 18,302 గ్రామాల్లో ప్రభుత్వం వర్షాకాలం ముందు, ఆ తర్వాత రెండు సార్లు తాగునీటి నాణ్యత పరీక్షలు జరిపిందని కేంద్రం వివరించింది. స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే తాగునీటి వనరుల్లో కూడా 97 శాతానికి పైగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది.
కలుషితాలను గుర్తించిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టిందని కేంద్రం పేర్కొంది. ఏపీలో 25,546 వనరుల్లో కలుషిత నీటిని గుర్తించగా.. 25,545 చోట్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment