Good water supply
-
సురక్షిత మంచినీటి సరఫరాలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రజలు తాగే నీటికి ఏటా కనీసం రెండు విడతల పాటు నాణ్యత పరీక్షలు నిర్వహించడం.. కలుషితాలు గుర్తించినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటి సౌకర్యాల కల్పన–ప్రజల భాగస్వామ్యం తదితర కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యల ఆధారంగా రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. మొత్తం 700కు గాను తమిళనాడు 699.93 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, ఏపీ 657.10 మార్కులతో రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అట్టడుగు స్థానాల్లో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఏపీలో 99.7 శాతం గ్రామాల్లో.. ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోర్లు, బావులు, ఇతర వనరులలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 99.7 శాతం గ్రామాల్లోని నీటిలో బ్యాక్టీరియా, కెమికల్ సంబంధిత కలుషితాలను ప్రాథమికంగా గుర్తించడానికి కిట్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి నిర్వహణపైనా గ్రామంలో ఒకరికి శిక్షణ ఇచ్చినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 18,357 గ్రామాలకు గాను 18,302 గ్రామాల్లో ప్రభుత్వం వర్షాకాలం ముందు, ఆ తర్వాత రెండు సార్లు తాగునీటి నాణ్యత పరీక్షలు జరిపిందని కేంద్రం వివరించింది. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే తాగునీటి వనరుల్లో కూడా 97 శాతానికి పైగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. కలుషితాలను గుర్తించిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టిందని కేంద్రం పేర్కొంది. ఏపీలో 25,546 వనరుల్లో కలుషిత నీటిని గుర్తించగా.. 25,545 చోట్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని వివరించింది. -
‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నీటి అవసరాలు.. తగ్గుతున్న వనరుల కారణంగా భవిష్యత్తులో పొంచిఉన్న నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కొనేందుకు ‘మురుగు నీటి శుద్ధి’కి అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉందని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వ్యక్తిగత వినియోగం, ఉత్పాదక, ఇంధన రంగాల్లో పెరిగిన డిమాండ్, సాగు అవసరాలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా నీటి వినియోగంలో గణనీయ మార్పులు అవసరమన్నారు. ఇందులో భాగంగా మురుగు నీటి లభ్యతను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేస్తున్నారు. పట్టణాలకు మంచి నీటి సరఫరాలో ఇస్తున్న ప్రాధాన్యతనే మురుగునీటి శుద్ధికి ఇవ్వాలని, ఈ నీటి వినియోగా న్ని సాగునీటి రంగానికి ముడిపెడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భూతాపం, భూగర్భ జలాల తగ్గుదల తీవ్రమవుతున్న నేపథ్యంలో మురుగు జల శుద్ధిపై హనుమంతరావు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే.. మురుగు నీరు అమూల్యమే.. పట్టణాలకు మంచినీటి సరఫరా చేసినప్పుడు అందులో 80 శాతం మురుగు నీటి లభ్యత ఉంటోంది. ఈ నీరు అమూల్యమే. ఈ మురుగు జలాన్ని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని నీటిపారుదల ప్రాజెక్టులుగా మలుచుకుని వ్యవసాయం చేయవచ్చు. హైదరాబాద్‌నే తీసుకుంటే ప్రస్తుత ం తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్న నీటిలో 18 టీఎంసీల మేర మురుగు ద్వారా లభిస్తోంది. దీనికి కొత్తగా కృష్ణా ఫేజ్-3(5 టీఎంసీలు), గోదావరి ఫేజ్-1(10 టీఎంసీ) ద్వారా మొత్తంగా 15 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ జరుగుతోంది. ఈ నీటిలో 80 శాతం అంటే 12 టీఎంసీలు మురుగు నీటిగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్క హైదరాబాద్‌లోనే 30 టీఎంసీల మురుగు నీటి లభ్యత ఉంది. దీనికి అదనంగా గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పూర్తయితే మరో 20 టీఎంసీల మంచినీటి సరఫరా జరిగితే అందులోనూ 16 టీఎంసీల మురుగు జలాల లభ్యత ఉంటుంది. అంటే భవిష్యత్తులో మొత్తంగా 46 టీఎంసీల మురుగు లభ్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లభ్యత ఉన్న 30 టీఎంసీల మురుగు నీటిలో కేవలం 8 టీఎంసీలనే రాష్ట్ర ప్రభుత్వం శుద్ధి చేస్తోంది. మరో 22 టీఎంసీల నీటి శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యానికి భంగమే.. మురుగు నీటి శుద్ధికి కేంద్రాన్ని, జైకాని ప్రభుత్వం నిధులు కోరినా ఆశించిన స్పందన లేదు. దీంతో శుద్ధి చేయకుండానే నీరు వెళ్లిపోతోంది. ఈ నీటిని వాడుకుంటూ అక్కడక్కడ గడ్డి, ఇతర కూరగాయల సాగు జరుగుతోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దృష్ట్యా మురుగు నీటి శుద్ధిని సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా చేసి నీటిపారుదలకు వినియోగించుకోవాలి. మొత్తంగా 30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగితే నల్లగొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న ప్రక్రియలో ఎక్కడా డ్యామ్, రిజర్వాయర్ వంటి హెడ్‌వర్క్స్ లేవు. అంతా పైప్‌లై న్ ద్వారానే జరుగుతోంది. కావున నీటి పారుదల రంగానికి ఈ నీటిని మళ్లించే క్రమంలో నీటి శుద్ధి ప్లాంట్‌నే హెడ్వర్క్స్గా మలుచుకోవాలి. దానికి కావాల్సిన కాల్వలను నీటిపారుదల రంగంలో భాగంగానే నిర్మించాలి. అప్పుడు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టదు. మొత్తంగా శుద్ధి ప్లాంట్లకు రూ. 2,773 కోట్లు, కాల్వలకు రూ. 1,227 కోట్లు కలిపి మొత్తంగా రూ. 4 వేల కోట్లు వ్యయమవుతుంది. ఈ నిధుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగితే ఎకరాకు రూ.1.3 లక్షలు ఖర్చు చేసినట్లవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద ఎకరాకు రూ. 3 లక్షలు ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ విధానానికి సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ అనుమతులు అక్కర్లేదు. మురుగు జలాల లభ్యత ఎక్కువగా ఉన్న వరంగల్, నిజామాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసి సాగునీటికి ఊతం ఇవ్వవచ్చు. -
జల మండలిపై భస్మాసుర ‘హస్తం’!
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాల్సిన జలమండలి పరిపాలన వ్యవహారాలపై భస్మాసుర ‘హస్తం’ పడింది. జలమండలిలో కీలక పదవుల్లో ఉన్న జనరల్ మేనేజర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, డెరైక్టర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో నగరానికి చెందిన ఓ మంత్రి మితిమీరి జోక్యం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సదరు పాలనా వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని తాజాగా ఆయన హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఛాంబర్లో జరిగిన సమావేశంలోనూ వాటర్‌బోర్డులో తన అనుమతి లేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టారదంటూ బోర్డు ఉన్నతాధికారులను ఆయన బెదిరించినంత పని చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూకల్లోతు ఆర్థిక నష్టాలు, సరఫరా నష్టాలతో సతమతమవుతున్న బోర్డుకు ఈ పరిణామం అశనిపాతమౌతోంది. బోర్డు నిబంధనలు బేఖాతర్..! జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. అప్పుడే ఉద్యోగుల నియామకం, భర్తీ తదితర విషయాల్లో బోర్డు యాజమాన్యానికే విచక్షణాధికారాలు కట్టబెట్టారు. కానీ ఇపుడు ఆ నిబంధనలు సదరు మంత్రికి పట్టడం లేదు. ఎన్నికల తరుణంలో తమ పబ్బం గడుపుకునేందుకు, ఆయన కనుసన్నల్లో పనిచేసే వారికే కీలక పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల టెండర్లు ముగిసిన కృష్ణా మూడోదశ పథకంలోనూ సదరు అమాత్యుని జోక్యం సుస్పష్టమేనన్న వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వవర్గాలు, గుత్తేదారులకు మధ్య రాజీ కుదిర్చినందుకు ఆయనకు బాగానే గిట్టుబాటయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివుల చుట్టూ ప్రదక్షిణలు తాజాగా జలమండలిలో బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో సదరు మంత్రి చలవ ఉంటే చాలన్న ధోరణి పెరుగుతుండటం గమనార్హం. గ్రేటర్లో సక్రమంగా మంచినీటి పంపిణీ, సరఫరా నష్టాల తగ్గింపు, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, రెవెన్యూ పెంచడం వంటి అంశాలను పక్కనబెట్టి కొందరు ఉన్నతాధికారులు సదరు అమాత్యుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం బోర్డు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.జలమండలి పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం శ్రుతిమించుతుండటంతో బోర్డు ముందరికాళ్లకు బంధం పడుతోంది. అసమర్థ అధికారుల బదిలీ, సమర్థులకు పదోన్నతులు కల్పించే విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తుండటంతో ఉన్నతాధికారుల్లో అభద్రతాభావం పెరుగుతుందన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం. -
నిరుపయోగమైన ఆసరా
సాక్షి, బెంగళూరు : వరద బాధితుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ అక్కరకు రావడం లేదు. విద్యుత్, మంచి నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కొరత ఉండటం వల్ల ‘ఆసరా’ ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.133.29 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా తయారయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో ఉత్తర కర్ణాటకను ముంచెత్తిన వరదలతో వందల సంఖ్యలో గ్రామాలు నీటిలో కొట్టుకుపోగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. బాధితుల సహాయార్థం ప్రభుత్వం ‘ఆసరా’ పథకం కింద నూతన ఇళ్లు కట్టించి ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. సర్వేలు, నివేదికలు తదితర కార్యక్రమాలు పూర్తిచేసిన ప్రభుత్వం చివరికి వరద తాకిడికి గురైన 228 గ్రామాల్లో 144 పూర్తిగా, 148 పాక్షికంగా వేరేచోటికి మార్చాలని నిర్ణయించారు. అదేవిధంగా వ రదల్లో ఇళ్లు కోల్పోయిన 56,511 కుటుంబాలకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఇంటిని నిర్మించి ఇవ్వాలనేది అసరా ప్రధాన ఉద్దేశం. నాలుగేళ్లు గడిచినా లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందా అంటే అదీ లేదు. ఇంకా 5,481 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లోనే ఉన్నట్లు రెవెన్యూ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక పూర్తయిన ఇళ్లల్లో దాదాపు 40 శాతం ఇళ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉంటున్నాయి. పునరావాసం పేరుతో గ్రామాలను పూర్వం ఉన్నచోటు నుంచి దూరంగా తీసుకువెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సదరు గ్రామాల ప్రజలు వ్యవసాయ, పశుపోషణ తదితర పనుల కోసం పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయలేకపోతున్నారు. దీంతో ఇళ్లు కూలిన చోటే చిన్నచిన్న గుడిసెలు వేసుకుని బతుకీడుస్తున్నారు. అంతేకాక ఆసరా ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో నాలుగేళ్లు కూడా పూర్తి కాకుండానే గోడలు బీటలు వారటం, చిన్నచిన్న వర్షాలకే పైకప్పు నుంచి ఇళ్లలోకి నీరు చేరడం జరుగుతోంది. మరోవైపు విద్యుత్, నీటిసరఫరా మురుగునీటి కాలువలు తదితర మౌలికసదుపాయాలు కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ ప్రభుత్వం కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఆసరా ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై మెల్కొని మౌలికసదుపాయాలు కల్పిస్తేలబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ప్రభుత్వం ఖర్చుపెట్టిన వేలాది కోట్లు వృథా కాకుండా పోతాయని రెవెన్యూశాఖ అధికారులు వాఖ్యానిస్తున్నారు.