‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు! | water problems in state of telangana | Sakshi
Sakshi News home page

‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!

Published Mon, Nov 30 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!

‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!

సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నీటి అవసరాలు.. తగ్గుతున్న వనరుల కారణంగా భవిష్యత్తులో పొంచిఉన్న నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కొనేందుకు ‘మురుగు నీటి శుద్ధి’కి అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉందని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వ్యక్తిగత వినియోగం, ఉత్పాదక, ఇంధన రంగాల్లో పెరిగిన డిమాండ్, సాగు అవసరాలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా నీటి వినియోగంలో గణనీయ మార్పులు అవసరమన్నారు. ఇందులో భాగంగా మురుగు నీటి లభ్యతను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేస్తున్నారు.

పట్టణాలకు మంచి నీటి సరఫరాలో ఇస్తున్న ప్రాధాన్యతనే మురుగునీటి శుద్ధికి ఇవ్వాలని, ఈ నీటి వినియోగా న్ని సాగునీటి రంగానికి ముడిపెడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భూతాపం, భూగర్భ జలాల తగ్గుదల తీవ్రమవుతున్న నేపథ్యంలో మురుగు జల శుద్ధిపై హనుమంతరావు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే..
 
మురుగు నీరు అమూల్యమే..
పట్టణాలకు మంచినీటి సరఫరా చేసినప్పుడు అందులో 80 శాతం మురుగు నీటి లభ్యత ఉంటోంది. ఈ నీరు అమూల్యమే. ఈ మురుగు జలాన్ని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని నీటిపారుదల ప్రాజెక్టులుగా మలుచుకుని వ్యవసాయం చేయవచ్చు. హైదరాబాద్‌నే తీసుకుంటే ప్రస్తుత ం తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్న నీటిలో 18 టీఎంసీల మేర మురుగు ద్వారా లభిస్తోంది.

దీనికి కొత్తగా కృష్ణా ఫేజ్-3(5 టీఎంసీలు), గోదావరి ఫేజ్-1(10 టీఎంసీ) ద్వారా మొత్తంగా 15 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ జరుగుతోంది. ఈ నీటిలో 80 శాతం అంటే 12 టీఎంసీలు మురుగు నీటిగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్క హైదరాబాద్‌లోనే 30 టీఎంసీల మురుగు నీటి లభ్యత ఉంది. దీనికి అదనంగా గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పూర్తయితే మరో 20 టీఎంసీల మంచినీటి సరఫరా జరిగితే అందులోనూ 16 టీఎంసీల మురుగు జలాల లభ్యత ఉంటుంది.

అంటే భవిష్యత్తులో మొత్తంగా 46 టీఎంసీల మురుగు లభ్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లభ్యత ఉన్న 30 టీఎంసీల మురుగు నీటిలో కేవలం 8 టీఎంసీలనే రాష్ట్ర ప్రభుత్వం శుద్ధి చేస్తోంది. మరో 22 టీఎంసీల నీటి శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
 
ప్రజారోగ్యానికి భంగమే..
మురుగు నీటి శుద్ధికి కేంద్రాన్ని, జైకాని ప్రభుత్వం నిధులు కోరినా ఆశించిన స్పందన లేదు. దీంతో శుద్ధి చేయకుండానే నీరు వెళ్లిపోతోంది. ఈ నీటిని వాడుకుంటూ అక్కడక్కడ గడ్డి, ఇతర కూరగాయల సాగు జరుగుతోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దృష్ట్యా మురుగు నీటి శుద్ధిని సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా చేసి నీటిపారుదలకు వినియోగించుకోవాలి.

మొత్తంగా 30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగితే నల్లగొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న ప్రక్రియలో ఎక్కడా డ్యామ్, రిజర్వాయర్ వంటి హెడ్‌వర్క్స్ లేవు. అంతా పైప్‌లై న్ ద్వారానే జరుగుతోంది. కావున నీటి పారుదల రంగానికి ఈ నీటిని మళ్లించే క్రమంలో నీటి శుద్ధి ప్లాంట్‌నే హెడ్‌వర్క్స్‌గా మలుచుకోవాలి. దానికి కావాల్సిన కాల్వలను నీటిపారుదల రంగంలో భాగంగానే నిర్మించాలి. అప్పుడు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టదు.

మొత్తంగా శుద్ధి ప్లాంట్లకు రూ. 2,773 కోట్లు, కాల్వలకు రూ. 1,227 కోట్లు కలిపి మొత్తంగా రూ. 4 వేల కోట్లు వ్యయమవుతుంది. ఈ నిధుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగితే ఎకరాకు రూ.1.3 లక్షలు ఖర్చు చేసినట్లవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద ఎకరాకు రూ. 3 లక్షలు ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఈ విధానానికి సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ అనుమతులు అక్కర్లేదు. మురుగు జలాల లభ్యత ఎక్కువగా ఉన్న వరంగల్, నిజామాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసి సాగునీటికి ఊతం ఇవ్వవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement