సాక్షి, బెంగళూరు : వరద బాధితుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ అక్కరకు రావడం లేదు. విద్యుత్, మంచి నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కొరత ఉండటం వల్ల ‘ఆసరా’ ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.133.29 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా తయారయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో ఉత్తర కర్ణాటకను ముంచెత్తిన వరదలతో వందల సంఖ్యలో గ్రామాలు నీటిలో కొట్టుకుపోగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
బాధితుల సహాయార్థం ప్రభుత్వం ‘ఆసరా’ పథకం కింద నూతన ఇళ్లు కట్టించి ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. సర్వేలు, నివేదికలు తదితర కార్యక్రమాలు పూర్తిచేసిన ప్రభుత్వం చివరికి వరద తాకిడికి గురైన 228 గ్రామాల్లో 144 పూర్తిగా, 148 పాక్షికంగా వేరేచోటికి మార్చాలని నిర్ణయించారు. అదేవిధంగా వ రదల్లో ఇళ్లు కోల్పోయిన 56,511 కుటుంబాలకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఇంటిని నిర్మించి ఇవ్వాలనేది అసరా ప్రధాన ఉద్దేశం. నాలుగేళ్లు గడిచినా లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందా అంటే అదీ లేదు. ఇంకా 5,481 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లోనే ఉన్నట్లు రెవెన్యూ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇక పూర్తయిన ఇళ్లల్లో దాదాపు 40 శాతం ఇళ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉంటున్నాయి. పునరావాసం పేరుతో గ్రామాలను పూర్వం ఉన్నచోటు నుంచి దూరంగా తీసుకువెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సదరు గ్రామాల ప్రజలు వ్యవసాయ, పశుపోషణ తదితర పనుల కోసం పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయలేకపోతున్నారు. దీంతో ఇళ్లు కూలిన చోటే చిన్నచిన్న గుడిసెలు వేసుకుని బతుకీడుస్తున్నారు. అంతేకాక ఆసరా ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో నాలుగేళ్లు కూడా పూర్తి కాకుండానే గోడలు బీటలు వారటం, చిన్నచిన్న వర్షాలకే పైకప్పు నుంచి ఇళ్లలోకి నీరు చేరడం జరుగుతోంది.
మరోవైపు విద్యుత్, నీటిసరఫరా మురుగునీటి కాలువలు తదితర మౌలికసదుపాయాలు కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ ప్రభుత్వం కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఆసరా ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై మెల్కొని మౌలికసదుపాయాలు కల్పిస్తేలబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ప్రభుత్వం ఖర్చుపెట్టిన వేలాది కోట్లు వృథా కాకుండా పోతాయని రెవెన్యూశాఖ అధికారులు వాఖ్యానిస్తున్నారు.
నిరుపయోగమైన ఆసరా
Published Mon, Sep 23 2013 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement