అక్రమాల సంగతేంటి? | About the illegality in HMDA? | Sakshi
Sakshi News home page

అక్రమాల సంగతేంటి?

Published Tue, Aug 27 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

అక్రమాల సంగతేంటి?

అక్రమాల సంగతేంటి?

సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హెచ్‌ఎండీఏలో, దాని పరిధిలోని జోనల్ కార్యాలయాల్లో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నపనికీ అధికారులు స్వప్రయోజనం వెతుకుతుండటంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెడ్డ పేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సోమవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘జోనల్ కార్యాలయాల పై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి.

అధికారులేం చేస్తున్నారు? సిబ్బందిపై నియంత్రణ లేదా? ఇలా ఎందుకు జరుగుతోంద’ని ప్రశ్నిం చారు. ‘సాక్షి’లో ‘మహా మాయ’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని తన ఫైల్ నుంచి బయటకు తీసి చూపుతూ అవినీతి అక్రమాలపై అధికారులను నిలదీశారు. ఆ వార్త ఈ రోజే ప్రచురితమైందని పీఆర్‌ఓ రామకృష్ణ చెప్పగా, దీనిపై ఉదయం నుంచి నీవేం చేశావ్? పై అధికారుల దృష్టికి తీసుకెళ్లావా? అంటూ ఎదురు ప్రశ్నవేశారు. సంస్థపై పత్రికల్లో వార్తలు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని, పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలని హితబోధ చేశారు.

కనీసం వివరణ అయినా ఇవ్వండని సూచించారు. స్పందన లేకుండా ఉంటే ఎలా అంటూ పరోక్షంగా కమిషనర్ నీరభ్‌కుమార్‌కు చురక అంటించారు. ‘ఇమేజ్ పెంచుకోండి.. కష్టపడి పనిచేస్తే పేరొస్తుంది. రూల్స్ ప్రకారం పనులు చేయండి. లేదంటే తిరస్కరించండి. అంతేగాని నెలల తరబడి ప్రజలను తిప్పుకోవద్దు’ అంటూ అధికారులను హెచ్చరించారు. శంకర్‌పల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఇక్కడ కొందరు సిబ్బందే కీలకమైన ఫైళ్లను తగులబెట్టడం వల్ల హెచ్‌ఎండీఏ ప్రతిష్ఠ దిగజారిందని, బాధితులకు న్యాయం చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
 
హైదరాబాద్ ఐకాన్.. ఔటర్
 హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రజలు ఔటర్ రింగ్‌రోడ్డు గురించి చెబుతున్నారని, దానిని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను తిలకించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, నిర్దేశించిన లక్ష్యాలను పీడీ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఔటర్ మెయిన్ క్యారేజ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌కి పూర్తి చేస్తామని, అలాగే ఫైనల్ వర్క్‌ను 2014 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. కమిషనర్ నీరభ్‌కుమార్ సంస్థ ఆర్థిక పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సిన బకాయీల విషయమై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఓ నిర్ణయం తీసుకొంటామని మంత్రి చెప్పారు. జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన అభివృద్ధి నిధులను కూడా ఇప్పించేందుకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
 
 తీరు మార్చుకోండి..
 విలువైన స్థలాలు కబ్జా అవుతోంటే వాటి నివారణ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ వారిపై తోసేస్తున్నారు. అటు వాళ్లు, ఇటు మీరు పట్టించుకోకపోతే ఆక్రమణలు మరింత పెరుగుతాయి. గ్రామ పంచాయతీల్లో ఇచ్చే పర్మిషన్లు కాదు... హెచ్‌ఎండీఏ ఇచ్చే అనుమతులే ఫైనల్ కావాలి. ఇందు కోసం ఒక విధానం కావాలి. కొంతమేరకు ప్లాన్లకు అనుమతినిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంటే అది కూడా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోనే చేసి ఫీజులో వారి వాటా వారికివ్వాలి. డెవలప్‌మెంట్ అథార్టీ అంటే నగరాభివృద్ధికి పాటుపడాల్సిన సంస్థ. జోనల్ కార్యాలయాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా కొత్త విధానాన్ని అభివృద్ధి చేయండి. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, బిల్డింగ్ ప్లాన్స్, లేఅవుట్స్ వంటివి ఆన్‌లైన్‌లో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై దృష్టిపెట్టి సత్ఫలితాలు సాధించండి.
 - మంత్రి మహీధర్‌రెడ్డి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement