ఉండాలా.. వెళ్లాలా?
అంతర్మథనంలో హెచ్‌ఎండీఏ ఇంజనీర్లు
జీహెచ్‌ఎంసీకి డిప్యూటేషన్‌పై సమాలోచనలు
సమ్మతి తెలిపేందుకు తుది గడువు 27
సిటీబ్యూరో : ప్రస్తుతం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు...భవిష్యత్‌లో కొత్తవి వస్తాయన్న నమ్మకమూ లేదు..! పీపీపీ ప్రాజెక్టులకు కూడా సర్కార్ నుంచి చుక్కెదురైంది. దీంతో తమ రోల్ ఏంటో తెలియక హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంలో ఆందోళన మొదలైంది. మరోవైపు మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని వివిధ శాఖలన్నింటిని ఒకే గొడుగు కిందకు తెస్తూ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను అమల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే... తమను జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర విభాగాలకు బదిలీ చేసే అవకాశం ఉందని వారు హడలిపోతున్నారు. ఇప్పటివరకు రాజధాని నగరంలో ఉద్యోగం చేసి తాము ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం సాధ్యం కాదంటున్నారు.
ఈ నేపథ్యంలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు 30కి పైగా ఇంజనీర్లు కావాలంటూ జీహెచ్‌ఎంసీ తాజాగా హెచ్‌ఎండీఏకు లేఖ రాసింది. ప్రధానంగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, లేక్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టులు, పార్కుల అభివృద్ధి, ప్రభుత్వం తాజాగా అప్పగించిన ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధి, నిర్వహణ వంటి పనులు నిర్వహించేందుకు 1 చీఫ్ ఇంజనీర్, 2 ఎస్‌ఈలు, 7 ఈఈలు, 25 మంది డీఈఈలు, 25 మంది ఏఈలు కావాలంటూ ఆ లేఖలో పేర్కొంది. ఏడాది పాటు డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో కొనసాగాలని తెలిపింది. దీంతో హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిలో అంతర్మథనం మొదలైంది. ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన మాతృసంస్థలోనే కొనసాగాలా...? లేక డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి వెళ్లాలా..? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఆఫీసులలో ఏ ముగ్గురు ఇంజనీర్లు కలిసినా...ఇదే విషయమై చర్చించుకోవడం కన్పించింది. ‘హెచ్ ఎండీఏలో ‘పనుల్లేవు... ప్రమోషన్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగడం కంటే ఇతర విభాగాలకు వెళ్లడమే మేలు’ అన్న అభిప్రాయం అత్యధికుల్లో వ్యక్తమవుతోంది. మరికొంతమంది డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు ఆచి తూచి అడుగేస్తున్నారు.
ఈ నెల 27 వరకు తుది గడువు
జీహెచ్‌ఎంసీకి డిప్యూటైషన్‌పై వెళ్లేందుకు సమ్మతి తెలపడానికి ఈ నెల 27ను తుది గడువుగా హెచ్‌ఎండీఏ నిర్దేశించింది. అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారు శుక్రవారం సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించింది. ఆతర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అదనుగా ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బంది అంతా డిప్యూటేషన్‌పై వెళితే నగరంలోని 4 కాంప్లెక్స్‌లు, 12 ఎస్టీపీలు, బీపీపీ పరిధిలోని పార్కులు వంటివాటి నిర్వహణ ఎలా అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులను కలవరపెడుతున్న విషయం.